
కాపులు ఏమైనా టెర్రరిస్టులా?
హైదరాబాద్: కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా పోలీసులను మోహరించడాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. జిల్లాలో పోలీసులను ఎందుకు మోహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు చంద్రబాబు సర్కారును నిలదీశారు. కాపుల సమస్యను శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వం చిత్రీకరిస్తున్నదని మండిపడ్డారు. పోలీసులు ఏ చట్టపరిధిలో వ్యవహరిస్తున్నారో డీజీపీ చెప్పాలని నిలదీశారు. చట్టాలను ప్రభుత్వం గౌరవించదా? అని ప్రశ్నించారు. కాపులను అవమానిస్తున్న చంద్రబాబు సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదని కన్నబాబు హెచ్చరించారు. కాపులు ఏమైనా టెర్రరిస్టులా అని ఆయన ప్రశ్నించారు.
పోలవరంపై కాకి లెక్కలు!
పోలవరం ప్రాజెక్టుపై పెరిగిన అంచనా వ్యయం వివరాలు తమకు అందలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, పెరిగిన అంచనా వ్యయం వివరాలను కేంద్రానికి ఎందుకు పంపలేదని కన్నబాబు నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు చెప్తున్న కాకిలెక్కలను కేంద్రం గుర్తిస్తుందని భయమా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌సీపీ అడ్డుకుంటున్నదని మంత్రి దేవినేని ఉమ అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కోర్టులో పిటిషన్లు వేశాయని, మరి పిటిషన్లు మీరు వేయించారా? అని కన్నబాబు ప్రశ్నించారు.