
మేం పిల్లల్ని కనలేదు.. బహుమతి ఇస్తారా!
- ఒక వర్గం వారు ఎంతమందినైనా కనొచ్చా?
- మళ్లీ పేలిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్
న్యూఢిల్లీ: ‘ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్నల్ని కనాలి’అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. ప్రధాని మోదీ చీవాట్లతో కొంతకాలంగా మౌనముద్రను దాల్చారు. ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి రాజకీయ సందడి నెలకొన్నవేళ మరోసారి తన నోటికి పనిచెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన సాక్షి మహారాజ్.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణిస్తూనే ఒక వర్గాన్ని టార్గెట్‌చేస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
‘అప్పట్లో నేను మాట్లాడిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలేమీ పిల్లల్ని కనే మిషన్లుకాదు! అయితే దేశంలో జనాభా పెరిగిపోతోంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తి.. నలుగురిని పెళ్లిచేసుకుని, 40 మంది పిల్లల్ని కని, మూడు సార్లు తలాక్ తీసుకుంటాడు. ఇకపై ఇలాంటి పద్ధతిని సహించబోయేది లేదు’ అని సాక్షి మహారాజ్ అన్నారు. తన కుటుంబవ్యవహారాన్ని వివరిస్తూ..‘మేం నలుగరు అన్నదమ్ములం. అందరం సన్యాసం స్వీకరించాం. తద్వారా పిల్లల్ని కనకుండా మా వంతు జనాభా ఉత్పత్తిని తగ్గించాం. ఇందుకుగానూ ప్రభుత్వాలు మాకు బహుమతి ప్రదానం చెయ్యాలి’అని పేర్కొన్నారు.