అంగన్‌వాడీలపై వరాల జల్లు
- కార్యకర్తల వేతనం రూ. 10,500కు పెంచుతామన్న కేసీఆర్
- మినీ అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనం రూ. 6,000కు పెంపు
- పదోన్నతులు, బీమా సదుపాయం కూడా.. 67,411 మందికి లబ్ధి
- డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత
- అంగన్‌వాడీ కార్యకర్తల పేరు అంగన్‌వాడీ టీచర్లుగా మార్పు
- వచ్చే నెల నుంచి అంగన్‌వాడీల్లో సన్న బియ్యం భోజనం
- ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు రూ.12 వేల ప్రోత్సాహకం
- ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనంగా అందజేత
- శిశువుల కోసం నూనెలు, సబ్బులతో కూడిన ప్రత్యేకమైన కిట్
సాక్షి, హైదరాబాద్
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాల వర్షం కురిపించారు. అంగన్ వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.7,000 నుంచి రూ.10,500కు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాల (హెల్పర్ల) వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.6,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంగన్‌వాడీ కార్యకర్తల హోదాను అంగన్‌వాడీ టీచర్లుగా మారుస్తున్నట్లు తెలిపారు.
ఇక ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు రూ.12 వేలు ప్రోత్సాహకంగా అందిస్తామని, ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనంగా అందిస్తామని సీఎం ప్రకటించారు. సోమవారం జనహితలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు అక్కడికక్కడే పలు నిర్ణయాలను ప్రకటించారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
పదోన్నతులు, బీమా సదుపాయం కూడా..
సీనియారిటీ, అర్హతల ఆధారంగా అంగన్‌వాడీ టీచర్లకు సూపర్ వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తామని, అంగన్‌వాడీ టీచర్, హెల్పర్లకు బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక వచ్చే నెల నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు సన్న బియ్యం భోజనం పెడతామన్నారు. మే నెలలో ఎండల కారణంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలకు రావడం ఇబ్బందిగా ఉన్నందున ఆ నెల పోషకాహారాన్ని నేరుగా ఇళ్లకే పంపుతామని ప్రకటించారు.
రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు
‘‘ప్రైవేటు డాక్టర్లు రాక్షసులకన్నా ఎక్కువగా తయారయ్యారు.. అంటే బాధ అనిపిస్తది. అక్కర ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేయడం, గర్భ సంచులు తీసేయడం.. ఇలా పరమ దుర్మార్గమైన, నీచమైన పనులు చేస్తున్నరు. మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టే పనులు చేస్తున్నరు..’’అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనిని నిర్మూలించేందుకు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం తమిళనాడు తరహాలో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నామని.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు రూ.15 వేల వరకు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించామని తెలిపారు.
రూ.12 వేలు.. రూ.2 వేల విలువైన కిట్
రాష్ట్రంలో మాతాశిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటరు. తెలంగాణ తల్లులు జన్మనిచ్చిన పిల్లలు రేపటి తెలంగాణ సంపద. వారు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం, పాలు, గుడ్లు అందిస్తాం. అందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడం. పేద గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులుగా ఉండి కూడా కుటుంబం గడవడం కోసం కూలి పనులకు వెళ్లాల్సి రావడం బాధాకరం. వారు డబ్బుల కోసం కూలి పనులకు వెళ్లకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించాం. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత కూడా తల్లీ బిడ్డల బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నాం..’’అని కేసీఆర్ చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.4 వేల చొప్పున మూడు విడతలుగా రూ.12 వేలు సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆడపిల్ల పుడితే చివరి విడతలో మరో రూ. వెయ్యి అదనంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇక పుట్టిన శిశువులకు కావాల్సిన నూనెలు, సబ్బులు, పౌడర్ల వంటి వాటితో రూ.2 వేల విలువ చేసే కిట్‌ను కూడా ప్రభుత్వం తరఫున బహుమతిగా ఇస్తామని చెప్పారు. ఈ పథకాన్ని పేద మహిళలు సద్వినియోగం చేసుకోవాలని.. ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. కాగా శిశువులకు అందజేసే కిట్‌ను కేసీఆర్ కిట్‌గా పిలవాలని అంగన్‌వాడీల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్లుగా అనంతరం సీఎం కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్, డైరెక్టర్ ఇందిర, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
67,411 మందికి లబ్ధి
వేతనాల పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ ఆవిర్భావం నాటికి అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.4,200. 2015 ఫిబ్రవరిలో రూ.7,000కు పెంచారు. తాజాగా 50 శాతం పెంపుతో వారి వేతనాలు రూ.10,500కు చేరాయి. ఇక మినీ అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు, హెల్పర్ల వేతనం రాష్ట్ర ఏర్పాటు నాటికి రూ.2,200గా ఉండగా.. 2015 ఫిబ్రవరిలో రూ.4,500కు పెంచారు. తాజాగా సుమారు 33.3 శాతం పెంపుతో వేతనాలు రూ.6,000కు చేరాయి.
ఇక నుంచి అంగన్‌వాడీ టీచర్లు: కార్యకర్తల హోదా మార్చుతూ ఉత్తర్వులు
అంగన్‌వాడీ కార్యకర్తల పేరును అంగన్‌వాడీ టీచర్లుగా మార్చారు. వారికి గౌరవ వేతనాన్ని పెంచడంతోపాటు హోదాను మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెంటనే చర్యలు చేపట్టింది. ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు అధికారులు ఫైలును సిద్ధం చేయగా.. ప్రభుత్వ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై అంగన్‌వాడీ కార్యకర్తలను అంగన్‌వాడీ టీచర్లుగా సంబోధించాలని అందులో పేర్కొన్నారు.