అమ్మకాల్లో ట్రయింఫ్ స్పీడు | Sales trayimph speed | Sakshi
Sakshi News home page

అమ్మకాల్లో ట్రయింఫ్ స్పీడు

Published Wed, Feb 4 2015 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

అమ్మకాల్లో ట్రయింఫ్ స్పీడు

అమ్మకాల్లో ట్రయింఫ్ స్పీడు

ఈ ఏడాది మరో రెండు మోడళ్లు
‘సాక్షి’తో ట్రయంఫ్ ఎండీ విమల్ సంబ్లీ ఇంటర్వ్యూ

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ, ప్రీమియం బైక్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారతీయ రోడ్లపై తన హవా కొనసాగిస్తోంది. ఒకేసారి 10 మోడళ్లతో 2013 నవంబరు 28న దేశంలో అడుగుపెట్టిన ఈ బ్రిటిష్‌త బ్రాండ్.. ఏడాదిలోనే 1,300 పైగా రైడర్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ‘తొలి ఏడాది 250 వాహనాలను విక్రయిస్తామని భావించాం. కానీ అంచనాలను మించిన స్పందన చూస్తున్నాం’ అన్నారు ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా ఎండీ విమల్ సంబ్లీ. అంతర్జాతీయంగా సంస్థ విక్రయిస్తున్న మోడళ్లను దశలవారీగా ఇక్కడ పరిచయం చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో  ఉన్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

బైక్‌పైనే మక్కువ..

ప్రీమియం బైక్‌లపై సరదాగా షికారుకెళ్లడం ఇప్పుడు కొత్త ట్రెండ్. అందుకే బైక్ ఖరీదెంతైనా భారతీయులు వెనుకాడడం లేదు. యాక్సెసరీస్ కోసమే రూ.2 లక్షలకుపైగా వెచ్చించే రైడర్లూ ఉన్నారు. ఎఫ్‌ఎంసీజీ రంగంలో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఉద్యోగి ఒకరు ఇల్లుకు బదులు బైక్ కొన్నాడంటే రైడర్ల ఆసక్తి అర్థం చేసుకోవచ్చు. రాకెట్-3 రోడ్‌స్టర్ ఖరీదు రూ.21 లక్షలపైనే. ఈ మోడల్‌లో ఇప్పటికి 50 యూనిట్లు విక్రయించాం. మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నా కస్టమర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారత్‌లో 500 సీసీ ఆపై సామర్థ్యమున్న బైక్‌ల మార్కెట్ 2008-09లో 450 యూనిట్లు. 2014-15లో ఇది 10 వేల యూనిట్లకు చేరుకుంది.
 
డిసెంబరుకల్లా మరో 5 షోరూమ్‌లు..

ప్రపంచవ్యాప్తంగా ఆరు విభాగాల్లో 28 రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అయిదు విభాగాల్లో 12 మోడళ్లను భారత్‌లో విక్రయిస్తున్నాం. ఆగస్టుకల్లా మరో రెండు మోడళ్లు రానున్నాయి. 10 విక్రయ కేంద్రాలున్నాయి. డిసెంబరుకల్లా మరో 5 తెరుస్తాం. రైడర్లయితేనే డీలర్‌షిప్ అప్పగిస్తాం.

హైదరాబాదీలు స్మార్ట్..

ఫుడ్, లగ్జరీ, గోల్డ్, ప్లాటినం, బైక్.. విషయం ఏదైనా హైదరాబాదీలు అనుభూతిని కోరుకుంటారు. ఇది రిచ్ మార్కెట్. ఫలానా మోడల్ కావాలని డిమాండ్ చేస్తారు. కస్టమర్లకు వాహనం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఇక్కడ  రైడర్లున్నారు. దేశంలో తొలి షోరూం బెంగళూరులో ప్రారంభమైనా, దానికంటే ముందే హైదరాబాద్ షోరూం సిద్ధమైంది. కొన్ని కారణాల వల్ల ప్రారంభం ఆలస్యమైంది. షోరూం తెరవకపోయినా బుకింగ్స్ నమోదయ్యాయంటే భాగ్యనగరవాసులకు ట్రయంఫ్ బ్రాండ్‌పట్ల ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. ఖరీదైన రాకెట్-3 రోడ్‌స్టర్‌ను అయిదుగురు హైదరాబాద్ కస్టమర్లు చేజిక్కించుకున్నారు. హైదరాబాద్ షోరూం నుంచి మొత్తం 125 బైక్‌లు రోడ్డెక్కాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement