
మిన్నంటిన నిరసనలు
సాక్షి నెట్‌వర్క్ : సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ లక్ష్యంగా ఎగసిన ఉద్యమం పతాకస్థాయికి చేరుతోంది. సమైక్యవాదుల పోరాటానికి వారం కిందట తోడైన సకల జనుల సమ్మె సోమవారం కూడా పూర్తిస్థాయిలో సాగింది. ప్రభుత్వకార్యాలయాలు, స్కూళ్ల మూత కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రావడం లేదు. సకలం బంద్‌తో జీవనం స్తంభిస్తున్నా ప్రజలు మాత్రం లెక్కచేయకుండా సమైక్యమే లక్ష్యంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు.
విశాఖచరిత్రలో మొదటిసారి పోర్ట్ బంద్ జరిగింది. సోమవారం లోడింగ్,అన్‌లోడింగ్ లావాదేవీలు పూర్తిస్థాయిలో స్తంభించాయి. దీంతో పోర్టు యూజర్స్‌కు సుమారు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆంధ్రాయూనివర్సిటీలో విద్యార్థి విభాగాలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, సమైక్యాంధ్ర రాష్ట్ర సమితి సభ్యుడు కర్రి ఆదిబాబు చేపట్టిన దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి.
కోర్టు ఉద్యోగుల విధుల బహిష్కరణ
విశాఖ జిల్లాలోని 61 న్యాయస్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సోమవారం విధులను బహిష్కరించడంతో అన్నికేసులు వాయిదా పడ్డాయి. ఎటువంటి అవాం ఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.శివప్రసాద్ అభ్యర్థన మేరకు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు.
విజయమ్మ దీక్షకు మద్దతుగా ఏజెన్సీ బంద్
విజయమ్మ దీక్షకు మద్దతుగా విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. చింతపల్లిలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కృష్ణా జిల్లాలో విజయమ్మ దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాణిజ్య పన్నులశాఖ సిబ్బంది విధులు బహిష్కరించి గుణదలలో మానవహారం నిర్మించారు. ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఎక్సైజ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, విద్యార్థులతో కలసి మానవ హారం ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో జ్యుడీషియల్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు.
రోడ్లు ఊడ్చి న్యాయవాదుల నిరసన
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో న్యాయవాదులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. దేవరపల్లిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరుకుంది. కొయ్యలగూడెంలో కుమ్మర్లు రోడ్డుమీద కుండలు తయారుచేసి నిరసన తెలిపారు. భీమవరంలో రోడ్డుపై వరి నాట్లు వేశారు. కేంద్ర ప్రభుత్వానికి, యూపీఏ అధ్యక్షురాలు, భారత ప్రధానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ వరద గోదావరిలో స్నానం చేయడానికి యత్నించిన కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావును పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన గోష్పాద క్షేత్రంలోని సుందరేశ్వరస్వామి ఆలయం ఎదుట పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. విజయమ్మ దీక్షకు సంఘీభావంగా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన రాఘవరాజు ఆదివిష్ణు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
జోరు వానలోనూ..
విజయనగరం జిల్లాలో జోరువానలోనూ ఆందోళనలు కొనసాగాయి. సమైక్యాంధ్ర జే ఏసీ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో సోమవారం భారీ మానవహారం నిర్వహించారు. గెజిటెడ్ అధికారులు కుటుంబసభ్యులతో మహార్యాలీ నిర్వహిం చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మిగనూరులో అంగన్‌వాడీ టీచర్లు పట్టణంలో ర్యాలీ తీశారు. రాజ మండ్రి గోకవరం బస్టాండ్ వద్ద పార్టీ యువజన విభాగం నేతలు పోలు కిరణ్‌మోహన్ రెడ్డి, గుర్రం గౌతం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి.
ఉపాధికూలీల ర్యాలీ
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో రెండువేలమంది ఉపాధి కూలీలు గ్రామ ప్రధాన వీధుల్లో ర్యాలీ జరిపారు. కోనసీమ ఎర్త్‌మూవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 జేసీబీలు, 50 ట్రాక్టర్లు, 100 లారీలతో గోపాలపురం నుంచి రావులపాలెం వరకూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్ర సాధన కోసం చేపట్టిన బస్సుయాత్ర రామచంద్రపురంలో కొనసాగింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరరెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు.
వెనక్కి నడిచి వైద్యుల నిరసన
గుంటూరులో ప్రభుత్వ వైద్యులు, నర్సులు వెనక్కు నడిచి.. రాష్ట్రాన్ని విభజిస్తే అభివృద్ధి వెనుకబడుతుందంటూ నిరసన తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక హిందూకళాశాల సెంటర్‌లో వేదపండితులతో మహాహోమం చేయించారు.
డీఆర్వో దీక్ష: అనంతపురం నగరంలో ఏపీఎన్‌జీవోలు భారీ ప్రదర్శన చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్‌ఓ హేమసాగర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఒక్క రోజు దీక్ష చేశారు.
బంజారాల ప్రదర్శన
అనంతపురంలో గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంజారాల ప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శనకు నగరంలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలు, వృద్ధులు, చిన్నారులు స్వచ్ఛందంగా వచ్చి సమైక్య నినాదాలు హోరెత్తించారు. గుడిబండ, పెనుకొండ, పెద్దపప్పూరులో వైఎస్సార్‌సీపీ నాయకులు, తాడిపత్రిలో వైఎస్ విజయమ్మ సేవాసమితి సభ్యులు రిలే దీక్షలకు దిగారు. మున్సిపల్, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు తిరుపతిలో భారీ బైక్‌ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో సోమవారం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. పీలేరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సుమారు 3వేల మందితో భారీ ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. శ్రీకాళహస్తిలో సుమారు 10వేల మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
మోకాళ్లపై నిలబడి న్యాయవాదుల నిరసన
ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి వారంరోజులపాటు బంద్ ప్రకటించాయి. వైఎస్ విజయమ్మ దీక్ష కు మద్దతుగా పాతపట్నం బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది.
విభజన భయానికి ముగ్గురు బలి
రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో సోమవారం ముగ్గురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణంలోని భవానీనగర్‌కు చెందిన దామరపాటి తంగవేలు నాయుడు (80) పది రోజులుగా విభజన నేపథ్యంలో టీవీలో వస్తున్న వార్తలను, కథనాలను వీక్షిస్తూ తీవ్ర ఆవేదనకు గురవుతుండేవాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో టీవీ చూస్తున్న ఆయన హఠాత్తుగా కుర్చీనుంచి కూలబడి మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, అనంతపురం జిల్లా రొళ్ల మండలం గుడ్డుగుర్కి గ్రామానికి చెందిన ఆర్.అశ్వర్థప్ప (60), కంబదూరు మండలం కూరాకులపల్లికి చెందిన కావలి నారాయణ స్వామి (57) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజులుగా వీరు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారు.
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ అడ్డగింత
పలుచోట్ల ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
సాక్షి నెట్‌వర్క్ : ఉద్యమంలో భాగంగా సమైక్యవాదులు సోమవారం సీమాంధ్ర జిల్లాల్లోని వివిధ నగరాల్లో ప్రారంభం కావాల్సిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నా రు. ప్రక్రియ కొనసాగకుండా బ్రేక్ వేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్శిటీలోనూ, నగరంలోని పాలిటెక్నిక్, ప్రభుత్వ మహిళా కళాశాలల్లో జరగాల్సినకౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు.
విజయనగరం, నెల్లూరుల్లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగంనేతలు, అనంతపురంజిల్లాలోని జేఎన్‌టీయూ,ఎస్కేయూల్లో ఆందోళన కారులుఅడ్డుకున్నారు. విశాఖ జిల్లాలో కౌన్సెలింగ్‌ను ఆర్టీసీ ఎన్‌ఎంయూ, ఈయూ, ఏపీఎన్‌జీవో సహా వివిధ సంఘాలు నేతలు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ విధులను ఉపాధ్యాయులే బహిష్కరించారు. ఒంగోలు నగరంలోనూ సమైక్యవాదుల సెగతో కౌన్సెలింగ్‌కు బ్రేక్ పడంది. ఏలూరులో సెరుుంట్ థెరిస్సా, తణుకులో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన కౌన్సెలింగ్‌ను ఎన్జీవోలు, జేఏసీ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆంధ్రా పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో జరగాల్సిన కౌన్సెలింగ్‌ను ఉపాధ్యాయులు, సిబ్బంది సమైక్య సమ్మెలో ఉన్న కారణంగా నిలిపివేసినట్లు కన్వీనర్లు సోమవారం ఉదయమే ప్రకటించారు.
బాబు ఫొటో లేకుండానే ‘పల్లె’ దీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబుపై సమైక్యవాదుల్లో తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబుకుతోందనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరంలో ఎక్కడా టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటో లేకుండా జాగ్రత్తపడ్డారు. తొలుత బాబు ఫొటోలతో ఫ్లెక్సీలు తయారుచేయించినప్పటికీ, బాబు ఫొటో శిబిరంలో ఉంటే ఒక్కరు కూడా మద్దతివ్వరని స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే చెప్పడంతో చివరకు ‘పల్లె’ టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ ఫొటోను ఫ్లెక్సీపై ముద్రించి దీక్ష చేపట్టారు.