సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన.. సమైక్య భేరి
సాక్షి నెట్‌వర్క్: అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర విభజనకు అనుకూల ప్రకటన వచ్చిన దరిమిలా సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 118వ రోజూ సోమవారం కోస్తా, రాయలసీమ ప్రజ సమైక్య స్ఫూర్తిని కొనసాగిస్తూ వివిధ రూపాల్లో ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండి సెంటరులో జేఏసీ నాయకులు దహనం చేశారు.
జేఏసీ ఆధ్వర్యంలో నాగాయలంకలో ధర్నా చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విభజనకు అనుకూల ప్రకటనలు చేస్తున్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను నెల్లూరులో దహనం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ‘రాష్ట్ర విభజన- విద్యార్థుల భవిష్యత్తు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట శివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
మంత్రి శైలజానాథ్‌కు ‘సమైక్య’ సెగ
మంత్రి డాక్టర్ శైలజానాథ్‌కు అనంతపురం జిల్లా మండల కేంద్రమైన బత్తలపల్లిలో సోమవారం ‘సమైక్య’ సెగ తగిలింది. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘రచ్చబండ’కు హాజరైన మంత్రిని వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు నిర్విరామపోరు సాగిస్తున్న పార్టీ శ్రేణులు సోమవారం నాడూ వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించాయి. చిత్తూరు, నెల్లూరు , తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలుచోట్ల ప్రారంభించిన దీక్షలు కొనసాగుతున్నాయి.