సాక్షి, రాజమండ్రి : ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని నిర్విరామంగా నినదిస్తూనే ఉన్నారు జిల్లావా సులు. రాష్ట్ర విభజన నిర్ణయంతో రగులుకున్న ఆగ్రహం ఆ నిర్ణయం రద్దుతోనే చల్లారుతుం దంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నానాటికీ బలోపేతమవుతోంది. పిల్లలు, పెద్దలు, మహిళలు, ఉద్యోగులు, రైతులు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. బుధవారం ఏలేశ్వరంలో మహిళా శక్తి సంఘాలకు చెందిన సుమా రు 5000 మంది మహిళలు విభజనవాదులారా ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. తొలుత ర్యాలీ జరిపి, అనంతరం బాలాజీ చౌక్‌కు చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమిస్తామని, విభజనవాదుల కుయుక్తులను తిప్పి కొడతామని ముక్త కంఠంతో నినదించారు.
రాజమండ్రిలో వివిధ ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ చేశారు. కంబాలచెరువు సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో సీబీఎం పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేసి, కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సోనియాకు మంచి బుద్ధి కలగాలని సీబీఎం విద్యాసంస్థ చైర్మన్ ఎం.రత్నకుమార్ ప్రార్థన చేశారు. జగన్నాథపురం వద్ద విద్యార్థినులు సైకిల్ ర్యాలీ చేశారు.
కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్వంలో ఉద్యోగులు ర్యాలీ చేశారు. ప్రభుత్వాస్పత్రి ఎదుట వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు వంటావార్పూ చేపట్టారు. డీఈఓ కార్యాలయం వద్ద విద్యాశాఖ ఉద్యోగులు దీక్షలు ప్రారంభించారు. రాజమండ్రిలో ఐసీడీఎస్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. యూటీఎఫ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు రాజమండ్రి మోరంపూడి సెంటర్‌లో రిలే దీక్షలు ప్రారంభించారు. తొలుత జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ధవళేశ్వరంలో ఎన్‌జీఓలు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. అమలాపురంలో కోనసీమ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం గడియారస్తంభం సెంటర్‌లో సమైక్య నినాదాలు చేస్తూ వివిధ ఆటలు ఆడారు. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పప్పుల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్‌లు నక్కా చిట్టిబాబు, బండారు రామ్మోహన్‌రావు, తాతాజీ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ పాల్గొన్నారు. అల్లవరం మండలం లో అంగన్ వాడీ వర్కర్లు రిలే దీక్షలు ప్రారంభించారు. అమలాపురం గడియారస్తంభం సెంటర్‌లో కొనసాగుతున్న రిలే దీక్షల్లో చల్లపల్లి పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 13న తలపెట్టిన ఓడలరేవు ఓఎన్‌జీసీ టెర్మినల్ ముట్టడిపై జేఏసీ నేతలు సమీక్ష చేశారు.
డప్పు వాయించిన ఎమ్మెల్యే
ముమ్మిడివరం తహశీల్దారు కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు చేపట్టిన 72 గంటల దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి తిరిగి వస్తూ తెలంగాణ వాదుల దాడులకు గురైన ఉద్యోగులను రావులపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆత్రేయపురంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఎమ్మార్పీస్ నేతల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విమర్శిస్తున్న వారు ఆ ధోరణి మానుకోక పోతే నాలుక తెగ్గోస్తానని హెచ్చరించారు. ఆయన అదే గ్రామంలో మిఠాయి దుకాణంలో స్వీట్లు తయారు చేసి, డప్పు వాయించి నిరసన తెలిపారు.
వెయ్యిమీటర్ల జాతీయ జెండా..
సమైక్యాంధ్రకు మద్దతుగా మలికిపురంలో ఆక్వారైతులు వెయ్యిమీటర్ల సమైక్య జెండాతో ర్యాలీ నిర్వహించారు. రాజోలులో న్యాయవాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. పిఠాపురంలో కొనసాగుతున్న దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు మద్దతు తెలిపా రు. సామర్లకోటలో రజకులు రోడ్డుపై దుస్తులు ఉతికారు. రోడ్డు పైనే బండ్లు పెట్టి, ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్, పట్టణ, రూరల్ మండలాల కు చెందిన 300 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సామర్లకోట తహశీల్దారు కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. పెద్దాపురంలో చాచా విద్యానికేతన్, బ్యాంకు కాలనీ మహిళలు, జేఏసీ ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు.
సోనియా భజన మానండి..
ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెపుతున్న కేంద్ర మంత్రులు సోనియా భజనతో కాలం వెళ్లబుచ్చుతున్నారని, ప్రజల గోడు పట్టించుకోవడం లేదని చాటుతూ రామచంద్రపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. కొందరు కేంద్ర మంత్రుల మాస్కులు ధరించి సోనియా మాస్క్ ధరించిన వ్యక్తి చుట్టూ కూర్చుని భజనలు చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో వంటా వార్పూ జరిగింది. కె.గంగవరం మండలం బాలాంతరంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో విద్యార్థులు ర్యాలీ చేసి ప్రధాన రహదారి వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.
విడిపోతే రాష్ట్రం ఎడారే..
పచ్చని చేలతో కళకళలాడే రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారిపోతుందని తాను రూపొందించిన కళాకృతి ద్వారా చాటారు అయినవిల్లి మండలం వెలవలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాకర శ్రీనివాస్. విభజనకు ముందు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నట్టుగా ఒక చిత్రం, విభజన తర్వాత సీమాంధ్ర ఎడారిగా మారినట్టు మరో చిత్రం థర్మోకోల్‌తో రూపొందించి అందరినీ ఆలోచింపజేశారు. కాగా పచ్చగా కళకళలాడే రాష్ట్రంలో సోనియా గాంధీ, కేసీఆర్ కలుపు మొక్కల్లా తయారయ్యారని, వారిని ఏరివేయాలని నినాదాలు చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మామిడికుదురులో పొలాల్లో కలుపుమొక్కలు తొలగించారు. అనంతరం బస్టాండు కూడలిలో జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. పాశర్లపూడి కొండాలమ్మచింత సెంటర్‌లో ట్రాక్టర్ల నిర్వాహకుల సంఘం ఆధ్వర్వంలో సమైక్య వాదులు వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉంచి అర్ధనగ్నంగా ధర్నా చేశారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో గ్రామస్తులు వంటావార్పూ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
తెలంగాణ అధికారులపై తమకు మమకారం తప్ప ద్వేషం లేదని చాటి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ 50వ డివిజన్ నాయకుడు గుత్తుల మురళీధర్ ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లశాఖ డీఐజీ నరసింహ, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ న్యూటన్, ఆరుగురు జైలర్లను పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ‘తెలంగాణ , సీమాంధ్రవాసుల ఐక్యత వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు సోదరభావంతో మెలగాలని విజయలక్ష్మి పిలుపు నిచ్చారు. ఉద్యోగులు, ప్రజలు కలిసి మెలసి ఉండాలని డీఐజీ ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్‌లో జరుగుతున్న నిరాహార దీక్షల్లో ఏపీ పేపరు మిల్లు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మామిడికుదురులో 23వ రోజు దీక్షల్లో భాగంగా అప్పనపల్లికి చెందిన మహిళలు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే గ్రామంలో ఆక్వారైతులు నిర్వహించిన ర్యాలీకి పార్టీ కో ఆర్డినేటర్‌లు చింతపాటి వెంకటరామరాజు, మత్తి జయప్రకాశ్ మద్దతు పలికారు. పెద్దాపురం, సామర్లకోట జేఏసీ దీక్షా శిబిరాలను వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ మండల నాయకుడు అలమండ చలమయ్య ఆధ్వర్యంలో ఏలేశ్వరం ప్రధానరహదారిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పార్టీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ చేసి బాలాజీ చౌక్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
జిల్లావ్యాప్తంగా జోరుగా సమైక్య ఉద్యమం
Published Thu, Sep 12 2013 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement