ఇసుక మాఫియా బరితెగింపు
అక్రమ తవ్వకాలు అడ్డుకున్న తుని ఎమ్మెల్యే రాజాపై దాడి
డి.పోలవరంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం
తుని రూరల్: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆదివారం మరోమారు రెచ్చిపోయింది.వారి అక్రమాలను అడ్డుకున్న సాక్షా త్తు ఎమ్మెల్యేపైనా దాడికి తెగబడ్డారు. కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, అతని అనుచరులు దాడికి దిగిన వివాదం సద్దుమణగకముందే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడికి పాల్పడింది. ఎమ్మెల్యేను రక్షించే యత్నంలో ఉన్న ఆయన గన్‌మన్‌పైనా దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే రాజా, గన్‌మన్ ప్రస్తుతం తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తుని మండలం డి.పోలవరంలో తాండవ నది పరీవాహక ప్రాంతంలో ఇసుకను నకిలీ వే బిల్లులతో టీడీపీకి చెందిన వారు తరలించుకుపోతూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇలా బొద్దవరం గ్రామానికి చెందిన మళ్ల నరసారావు, సోదరుడు సత్యనారాయణ పొలంలో వారు ఇసుకను తవ్వేస్తున్నారు. దీనిని భూ యజమానులు అడ్డుకున్నారు.ఆగ్రహించిన బర్ల గోవిందు, ఈశ్వరరావు అనే వారు భూ యజమాని నరసారావుపై దాడిచేసి గాయపర్చారు. బాధిత రైతులు ఫోన్‌లో ఎమ్మెల్యే రాజాకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు.ఆ సమయంలో 13 ట్రాక్టర్లు ఇసుకలోడుతో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నాయి.ఎమ్మెల్యే ట్రాక్టర్లకు అడ్డంగా తన వాహనాన్ని నిలిపి రెవెన్యూ, పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్‌లో వివరించారు. కొద్దిసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ నాయకులు, రాష్ట్రమంత్రి యనమల రామకృష్ణుడు బంధువులు, అతని అనుచరగణం ట్రాక్టర్లకు అడ్డంగా ఉన్న ఎమ్మెల్యే కారును పక్కకు నెడుతుండగా వారించిన ఎమ్మెల్యే అనుచరులపై దాడులకు దిగారు. దీంతో ఎమ్మెల్యే రాజాకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన ఆయన గన్‌మెన్ నాగకన్నయ్యపైనా దాడిచేసి గాయపరిచారు. అక్కడికి చేరుకున్న సీఐ అప్పారావుకు ఎమ్మెల్యే రాజా ఫిర్యాదుచేశారు. అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయాలని కోరుతూ నకిలీ వే బిల్లులను చూపించారు. అనంతరం చికిత్సకోసం తుని వెళ్లారు.