భర్తకు మద్దతిస్తా... భారత్‌కూ జై కొడతా
బర్మింగ్‌హామ్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ సమరంలో భర్త షోయబ్ మాలిక్ (పాక్ క్రికెటర్)కు మద్దతిస్తానని... అదే సమయంలో స్వదేశానికి జై కొడతానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. ప్రస్తుతం వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నద్ధమవుతున్న ఆమె.. తనను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలు బాధాకరమని చెప్పింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు ఆమె ఇరుజట్లకు శుభాకాంక్షలు తెలిపింది. దీనిపై భారత నెటిజన్లు మండిపడ్డారు.
ఆమె 60 లక్షల ఫాలోయర్స్‌లో కొందరు విమర్శలతో ట్వీట్స్ చేశారు. దీనిపై డబుల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సానియా స్పందిస్తూ ‘అలాంటి విమర్శల్ని నేను పట్టించుకోను. బయటెక్కడో కూర్చుని తమకిష్టమొచ్చినట్లు అనడం సులభమే. అదృష్టం కొద్దీ అలాంటి విమర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు. అదేంటో ఏమో నేనంటే ఏమాత్రం తెలియనివాళ్లు కూడా విపరీతంగా స్పందించడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నిజానికి 80 శాతం మంది నన్ను మంచిగానే అర్థం చేసుకుంటే, కేవలం 20 శాతం మందే ప్రతిదానికీ పెడర్థాలు తీస్తారు. కానీ మెజారిటీ ప్రజలు నన్ను బాగానే రిసీవ్ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది.
ఆటను ఆటగానే చూడాలి
ఇండో, పాక్‌ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరుగుతున్నా తనకు ఇలాంటి ఇబ్బందులు తప్పట్లేదని ఆమె చెప్పింది. మన దేశంతో ఆడుతున్నపుడు ప్రత్యర్థి జట్టులో ఉన్న భర్తను తాను శత్రువుగా చూడాలనుకోవడం తగదని ఆమె హితవు పలికింది. ‘ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఇది కేవలం క్రీడ. ప్రతి అథ్లెట్ ఆటను ఆటగానే చూడాలనుకుంటాడు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడితే అది ఆటలో భాగమే.. కానీ అదేమీ యుద్ధం కాదు. జీవన్మరణ పోరు అంతకన్నా కాదు’ అని సానియా వివరించింది.
క్రీడాస్ఫూర్తి అంటే అదే..
దాయాది ఆటగాళ్లు కేవలం మైదానంలోనే ప్రత్యర్థులని చెప్పింది. ‘ఫైనల్ మ్యాచ్ ముగిశాక తన భర్త షోయబ్ మాలిక్, భారత ఆటగాళ్లు కోహ్లి, యువరాజ్‌లతో సరదాగా మాట్లాడుకున్నారు. బహుమతి ప్రదానోత్సవానికి ముందు ఓ పది నిమిషాల పాటు ఇది సాగింది. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే. మైదానంలోనే ప్రత్యర్థులు. అది ముగిశాక అందరు స్నేహితులే. నిజానికి ఇరు దేశాల ప్రజలు మాట్లాడే భాష, తినే తిండి ఒకలాగే ఉంటుంది. సంస్కృతి కూడా ఒకలాగే అనిపిస్తుంది. కానీ ఇదేది విమర్శకులకు పట్టదు. బహుశా ఎలాంటి ఆట ఆడకపోవడం వల్లేనేమో!’ అని సానియా చురక వేసింది
స్థిరమైన భాగస్వామి లేకపోతే...
గత ఆగస్టు దాకా మార్టినా హింగిస్‌తో కలిసి పలు టైటిల్స్ నెగ్గిన ఆమె గత సీజన్‌ను నంబర్‌వన్ (డబుల్స్‌లో)తో ముగించింది. కానీ ఇటీవల తరచూ డబుల్స్ భాగస్వామిని మార్చడం పెద్ద సమస్యని పేర్కొంది. గత ఆగస్టు తర్వాత స్ట్రికోవాతో జతకట్టిన ఆమె... తదనంతరం ష్వెదోవాతో కలిసి ఆడింది. అయితే గాయం కారణంగా ష్వెదోవా కొన్ని వారాలపాటు ఆటకు దూరమైంది. ఈ నేపథ్యంలో వింబుల్డన్ సన్నాహక టోర్నీలో కొకొ వాండెవెగె (అమెరికా)తో సానియా బరిలోకి దిగింది. తాజాగా 48వ ర్యాంకర్ కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం)తో కలిసి వింబుల్డన్ టోర్నీలో ఆడనుంది.