‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’ | Sanjay Leela Bhansali tampered our history: Rajput Karni Sena | Sakshi
Sakshi News home page

‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’

Published Sat, Jan 28 2017 11:13 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’

‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’

జైపూర్: ‘పద్మావతి’ సినిమా షూటింగ్‌ సెట్స్‌లో రాజ్‌పుత్‌ కర్ణి సేన కార్యకర్తల వీరంగం, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి ఘటన అటు సినీ రంగంతోపాటు ఇటు రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం ‘పద్మావతి’ యూనిట్‌పై జరిగిన దాడిని బాలీవుడ్‌ నిర్మాతల సంఘం ఖండించగా, రాజ్‌పుత్‌ సేన మాత్రం సంజయ్‌ లీలాపై ఎదురుదాడిని కొనసాగించింది. ‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’అని ఆరోపించింది.

రాజ్‌పుత్‌ కర్ణి సేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్‌ కల్వీ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వీకుల చరిత్రను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ‘సంజయ్‌లీలాకు ఎంత దమ్ముంటే మా సొంత గడ్డమీద, మా పూర్వీకులకు సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడు? జర్మనీలో హిట్లర్‌కు వ్యతిరేకంగా సినిమా తీసే దమ్ముందా ఈయనకి? ‘పద్మావతి’ సినిమాలో రాజ్పుట్ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా చిత్రీకరిస్తున్నారు. ఒక్క పద్మావతేకాదు.. ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే. గతంలో ‘జోధా అగ్బర్‌’లోనూ జోధాబాయి చరిత్రను తప్పుగా చూపించారు. అందుకే ఆయనకు బుద్ధిచెప్పాలనుకున్నా. చెప్పాం..’ అని లోకేంద్ర సింగ్‌ కల్వీ వివరించారు.

భన్సాలీకి బాలీవుడ్‌ బాసట: పద్మావతి షూటింగ్‌ సెట్‌లో దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని చెంపదెబ్బకొట్టి, జుట్టుపట్టి ఈడ్చిన ఘటనపై బాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్ట్‌ అధ్యక్షుడు విక్రం భట్‌ స్పందించారు. ‘క్రియేటివ్‌ కళాకారుల జీవితాలు గాజు మేడల్లా తయారయ్యాయని ఆయన ఆదేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ మొత్తం సంజయ్‌లీలాకు బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు (షూటింగ్‌లపై దాడులు) జరగకుండా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావడంలేదని భట్‌ అన్నారు. (షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి)

హోం మంత్రి ఏమన్నారంటే: ‘పద్మావతి’ యూనిట్‌పై రాజ్‌పుత్‌ కర్ణి సేన దాడిపై రాజస్థాన్‌ హోం మంత్రి జి.సి.కటారియా స్పందించారు. మనోభావాలు దెబ్బతిన్న సందర్భంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రవర్తించడం గర్హనీయమని మంత్రి అన్నారు. దాడి ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉంటే, నిన్నటి దాడి అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు శనివారం ఉదయం విడుదలయ్యారు.

వర్మ కామెంట్‌: ‘పద్మావతి’పై దాడి విషయంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ భిన్నంగా స్పందించారు. నిన్నటి ఘటనతో పద్మావతి, ఖిల్జీ, రాజ్‌పుత్‌ కర్ణి సేనల గురించి దేశం మొత్తానికి తెలిసిందని, ఇందుకుగానూ సంజయ్‌ లీలా భన్సాలీకి థ్యాక్స్‌ చెబుతున్నానని ట్వీట్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement