
యువరాజు.. డ్రగ్స్ స్మగ్లింగ్!
బీరుట్: పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తూ సౌదీ యువరాజుతోపాటు మరో నలుగురు పట్టుబడ్డారు. దాదాపు రెండు టన్నుల క్యాప్టగాన్ మాత్రలు, కొకైన్ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ సౌదీ యువరాజు అబ్దెల్ మోసెన్ బిన్ వాలిద్ బిన్ అబ్దులజిజ్ లెబనాన్లోని బీరుట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టయ్యారు. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీరుట్ విమానాశ్రయ చరిత్రలోనే పట్టుబట్ట అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా ఇదేనని భద్రతా అధికారులు తెలిపారు.
బీరుట్ విమానాశ్రయం నుంచి రహస్యంగా డ్రగ్స్ ను స్మగ్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా అధికారులు గుర్తించారు. కాప్టగాన్ మనో ఉద్దీపన కలిగించే మాత్ర. దీనిని తీసుకోవడం ప్రధానంగా మధ్యప్రాచ్యంలో నిషేధించారు. సిరియా ఫైటర్లు ఈ మాత్రలను పెద్దమొత్తంలో తీసుకుంటారని తెలుస్తున్నది. మాదక ద్రవ్యాలను పెట్టెల్లో అమర్చి.. ప్రైవేటు విమానంలో సౌదీ అరేబియా తరలిస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు.