
మధ్యతరగతి భారతీయుల్లో పొదుపు రేటు డౌన్
బన్యూఢిల్లీ: సంపాదనలో ఎంతోకొంత పొదుపు చేసుకోవడం అనేది భారతీయుల జీవనం విధానంలో అంతర్భాగం. అలాంటిది ఇప్పుడు దీనికి చిల్లుపడుతోంది. అంతకంతకూ ఎగబాకుతున్న ధరలు, అధిక ఇంధన రేట్ల భారం.. విద్య, ఆరోగ్య బీమా ప్రీమియంల వ్యయాలు తడిసిమోపెడవుతుండటం వంటివన్నీ మధ్యతరగతి భారతీయుల వాస్తవ ఆదాయాలు ఆవిరయ్యేలా చేస్తున్నాయి. దీంతో గడిచిన మూడేళ్లలో పొదుపు రేటు 40% పడిపోయినట్లు అంచనా.
పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. పేద ప్రజలు ప్రస్తుత ధరాభారాన్ని భరించలేక తల్లడిల్లుతుంటే.. మధ్య తరగతి వర్గాల కొనుగోలు శక్తికి అధిక ద్రవ్యోల్బణం చిల్లుపెడుతోందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. దీంతో పొదుపు చేయడానికి చేతిలో డబ్బు మిగిలే పరిస్థితి కానరావడం లేదని చెప్పారు. సర్వే నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...
కుటుంబ ఖర్చులు భారీగా పెరిగిపోతుండటంతో భారతీయుల నికర పొదుపు(బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో నగదు డిపాజిట్లు; షేర్లు, డిబెంచర్లు, చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లలో నగదు పెట్టుబడులు ఇతరత్రా మార్గాల్లో) మొత్తం కూడా గణనీయంగా హరించుకుపోతోంది.
మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధిక శాతం కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకోవడం.. తద్వారా మిగుల్చుకునే డబ్బును షాపింగ్ సమయాల్లో తక్కువ రేట్లకు వచ్చే వస్తువులను కొనుక్కోవడానికి ఉపయోగించుకుంటున్నారు.
ఆదాయాలను పెంచుకోవడం కోసం మరిత మెరుగైన జీతం వచ్చే ఉద్యోగాలకు మారాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ఒకరు పేర్కొన్నారు. లేదంటే అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ఎక్కువ సమయం పనిచేయడం వంటివి వాటిపై దృష్టిపెడుతున్నారు.
అధిక ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు కూడా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక వ్యయాలు పెరిగిపోవడం, ఉద్యోగుల నుంచి జీతాల పెంపు డిమాండ్‌లు కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి.
జీవన వ్యయం 40-45% పెరిగిపోయిందని, దీనికి అనుగుణంగా గతేడాది జీతాల పెంపు లేదని సర్వేలో 82% మంది అభిప్రాయపడ్డారు. మరింత అధిక జీతాలను కోరుకుంటున్నట్లు చెప్పారు.
సర్వేలో 82 శాతం మంది మెట్రోవాసులు ఆర్థికంగా తాము చితికిపోతున్నామని, తమ జీవన ప్రమాణాలు 25 శాతం మేర దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
{దవ్యోల్బణం సెగ, అధిక ఇంధన భారాలను తట్టుకోవడం కోసం ఎక్కువ మంది మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు తమ ఖర్చుల్లో సాధ్యమైన చోటల్లా కోత పెట్టుకుంటున్నారు. లేదంటే చౌక ఉత్పత్తులను కొనుగోలు చేయడం, కొనుగో ళ్లను వాయిదా వేసుకోవడం వంటివి చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య మూడు నెలల వ్యవధిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, పుణే, చండీగఢ్, డెహ్రాడూన్ తదితర నగరాల్లో సర్వే నిర్వహించారు.
కూరగాయలు, పండ్లు, ఇతరత్రా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో... అక్టోబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 7%కి, రిటైల్ ద్రవ్యోల్బణం 10.09 శాతానికి ఎగబాకడం తెలిసిందే.