
ఇక యూట్యూబ్‌లో ఎస్‌బీఐ
ముంబై: వీడియో షేరింగ్ వెబ్‌సైట్, యూట్యూబ్‌లో బ్యాంకింగ్ దిగ్గజం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తన చానల్‌ను గురువారం ప్రారంభించింది. త్వరలో మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో కూడా ప్రవేశిస్తామని తద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు మరింతగా విస్తరిస్తామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ప్రారంభంలో ఈ యూట్యూబ్ చానెల్‌లో బ్యాంక్ సంబంధిత వివరాలు. అందిస్తున్న సర్వీసులు, ఇతర సమాచారాన్ని అందిస్తామని వివరించారు. ఆ తర్వాత బ్యాంక్ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలను కూడా పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఎస్‌బీఐ గతేడాది నవంబర్‌లోనే ఫేస్‌బుక్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఎస్‌బీఐ 15 వేల బ్రాంచీలతో 43 వేల ఏటీఎంలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.