ఎస్బీఐ కీలక నిర్ణయం: సగం ఆఫీసుల మూత
ఎస్బీఐ కీలక నిర్ణయం: సగం ఆఫీసుల మూత
Published Tue, Mar 21 2017 1:09 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా వెలుగొందేందుకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చేపట్టే ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఇక త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విలీనం తర్వాత అనుబంధ బ్యాంకుల సగం కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. దీనిలోనే మూడు ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయట. ఏప్రిల్ 24 నుంచి ఈ మూసివేసే ప్రక్రియను ప్రారంభించబోతుంది. అనుబంధ బ్యాంకుల ఐదు ప్రధాన కార్యాలయాల్లో కేవలం రెండింటిని మాత్రమే ఉంచాలనుకుంటున్నామని, అనుంబంధ బ్యాంకులకు సంబంధించి 27 జోనల్ ఆఫీసులు, 81 రీజనల్ ఆఫీసులు, 11 నెట్ వర్క్ ఆఫీసులతో పాటు మూడు ప్రధాన కార్యాలయాలను మూసివేస్తామని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఖరా చెప్పారు.
ఏప్రిల్ 24 వరకే ప్రస్తుత నమూనాను ఇలా ఉంచుతామని, అనంతరం అనుబంధ బ్యాంకుల కంట్రోలింగ్ ఆఫీసులను, రీజనల్ ఆఫీసులను, జోనల్ ఆఫీసులను, నెట్ వర్క్ ఆఫీసులను తగ్గించే ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ లను ఎస్బీఐ తనలో విలీనం చేసుకోనుంది. సోమవారమే భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనమైంది. ఈ విలీనంతో రూ.40 లక్షల కోట్ల ఆస్తులను ఈ బ్యాంకు సంపాదించుకోనుంది. ప్రస్తుతం 550 ఎస్బీఐ ఆఫీసులు, అనుబంధ బ్యాంకులు 259 ఆఫీసులు కలిగి ఉన్నాయి. విలీనం తర్వాత 687 ఆఫీసులనే కంట్రోలింగ్ ఆఫీసులుగా పరిమితం చేయాలని నిర్దేశించుకున్నామని ఖరా చెప్పారు. ఈ ప్రభావం 1107 ఉద్యోగులపై పడనుందని ఎస్బీఐ అంచనావేస్తోంది. కస్టమర్-ఇంటర్ఫేస్ ఆపరేషన్స్ లో వారిని నియమిస్తామని ఖరా తెలిపారు.
Advertisement
Advertisement