ఆ విమానం ఆచూకీ ఎప్పటికీ మిస్టరీయే
కౌలాలంపూర్: మూడేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ఆచూకీ ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది. ఈ విమానం ఆచూకీ కోసం హిందూ మహాసముద్రంలో చేపట్టిన గాలింపు చర్యలను నిలిపి వేయాలని నిర్ణయించారు. దీంతో ఎంహెచ్ 370 జాడ గుర్తించకుండానే ఆపరేషన్ ముగిసింది. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతికను ఉపయోగించుకుని, నిపుణులు సలహాలు తీసుకుని సముద్రంలో విస్తృతంగా గాలించామని, అయితే విమానం ఆచూకీ తెలుసుకోలేకపోయామని ఆస్ట్రేలియాలోని జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకటించింది.
2014 మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. బయల్దేరిన కొద్ది సేపటికే ఆ విమానం సముద్రంలో కూలినట్లు అప్పట్లో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. ఈ విమానం ఆచూకీ కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నౌకా దళాలు గాలించాయి. భారత్‌కు చెందిన సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయినా ఫలితం లేకపోయింది. గతంలో కనబడకుండా పోయిన విమానాలు, ఓడల్లాగా ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది.