
సమైక్యానికి తెర.. విభజనకు సై
అధిష్టానం బాటలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
విభజనకు అనుకూలంగా సీమాంధ్ర ప్రజల్లోకి వెళ్లే యత్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వేసుకొన్న సమైక్య ముసుగు క్రమేణా తొలగిపోతోంది. అధిష్టానం రూపొందించిన వ్యూహంలో భాగంగా వారంతా ఇపుడు రెండో అంకానికి తెరలేపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు, సీమాంధ్ర ఎంపీలు సమైక్యస్వరాన్ని మార్చి విభజన వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. మిగతావారు కూడా అదే బాటపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొనేందుకు గురువారం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ తొలిభేటీ అవుతోంది.
ఉద్యమాన్ని నీరుగార్చే దిశగా..
ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విభజనకు అనుకూలురుగా ఉన్న మంత్రులు, ఇతర నేతలతో ఈ కమిటీని ఇటీవలే ఏర్పాటుచే సిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలిభేటీ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయానికి అనుగుణంగా సీమాంధ్ర ప్రజలను మార్చే మార్గాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సమైక్య ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మెల్లమెల్లగా దాన్ని చల్లబరిచే ప్రయత్నాలపై చర్చించనుంది. ఢిల్లీ పెద్దల డెరైక్షన్ మేరకు ఇప్పటివరకు సమైక్య రాష్ట్రం, పదవులకు రాజీనామాలు అంటూ పైపైన హడావుడి సృష్టించి ఉత్తుత్తి రాజీనామాలతో ప్రజలను బురిడీ కొట్టించిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తమ అసలు స్వరూపాన్ని బయటకు తీస్తున్నారు. తాము సమైక్యవాదులమేనని, కానీ కేంద్రం నిర్ణయం తీసుకున్నందున సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను రక్షించడంపై దృష్టి సారిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, పురందేశ్వరి, చిరంజీవి, జేడీ శీలం, కిల్లి కృపారాణి సహా రాష్ట్ర మంత్రులు కూడా విభజనకు అనుకూలంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు.
తుపాను పేరుతో ప్రజల్లోకి..
పై-లీన్ తుపానును సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్జీఓలను, వివిధ ఇతర ఉద్యోగ సంఘాలను సమ్మెనుంచి కొంతమేర వెనక్కు తగ్గేలా చేసింది. దీన్ని అదనుగా చేసుకొని కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ప్రాంతాల్లో అడుగుపెట్టడం ప్రారంభించారు. బాధితుల పరామర్శ పేరిట సమైక్య ఉద్యమంలోకి చొరబడే ప్రయత్నాలు చేశారు. రెండునెలలకు పైగా తమ సొంత నియోజకవర్గాల్లో అడుగుపెట్టడానికి సాహసించని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పై-లీన్ తుపాను బాధితుల పరామర్శపేరిట విజయనగరానికి వెళ్లారు. ఉద్యమ తాకిడి తగలకుండా ఉండేందుకు భారీ బందోబస్తు మధ్య ఆయన పర్యటన సాగించారు. ఉద్యమాన్ని మెల్లమెల్లగా చల్లార్చి తమ అసలు కార్యాచరణను ప్రారంభించేందుకు అసలైన తరుణమిదేనని తలచి ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ సమావేశాన్ని బొత్స ఏర్పాటుచేయించారు.
కేంద్రమంత్రులు పల్లంరాజు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, ఇలా ఒకరొకరుగా సీమాంధ్రలోకి అడుగుపెడుతున్నారు. సమైక్యపలుకులు వినిపిస్తూనే విభజన అనివార్యమైతే.. అంటూ సన్నాయినొక్కులు ప్రారంభించారు. మరో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తొలి నుంచీ తాను రాజీనామా చేసేదే లేదని చెబుతూ ఇపుడు సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలకోసం కేంద్రమంత్రుల బృందాన్ని కలుస్తామని పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తప్పదని, ఈ విషయంలో తాను కేంద్రమంత్రుల బృందాన్ని కలుస్తానని రాష్ట్రమంత్రి బాలరాజు అంటున్నారు. ఏతావాతా ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలు మెల్లమెల్లగా స్వరం మారుస్తూ అధిష్టానం బాటలో సీమాంధ్ర ప్రజలను మరల్చే ప్రయత్నాల్లో పడుతున్నారు. గురువారం నాటి సమావేశంలో ఇవే అంశాలపై కీలకచర్చ సాగించనున్నారు.