సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినట్టు అంగీకరించొద్దని స్పీకర్ మీరాకుమార్‌కు సీమాంధ్రకు చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు లేఖ రాశారు. 14వ తేదీతో ఉన్న ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పురందేశ్వరి ఉన్నారు. ‘‘నిబంధనావళితో సంబంధం లేకుండా కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సభలోకి తెచ్చారు. సవరించిన ఎజెండాలో కూడా లేనప్పుడు సప్లిమెంటరీ బిజినెస్‌లో ఉండడం సభాసాంప్రదాయం. కానీ ఆ బిల్లు సవరించిన ఎజెండాలో లేదు. సప్లిమెంటరీ ఎజెండా కూడా ఏదీ ఇవ్వలేదు. మీరు మాత్రం 12 గంటలకు హోంమంత్రిని పిలిచారు.
సప్లిమెంటరీ జాబితా 2 గంటలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా సభా సంప్రదాయాలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ఉద్దేశాలను, స్పీకర్ కార్యాలయం ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోంది. బిల్లు ప్రవేశపెట్టినట్టు ప్రకటించడాన్ని బీజేపీ సహా అనేక రాజకీయ పార్టీలు ఖండించాయి. తిరిగి బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలి’’ అని అందులో కోరారు.
సస్పెన్షన్లపై పునరాలోచించాలి: ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఎత్తివేయాలని కోరుతూ ఈ ఐదుగురు కేంద్ర మంత్రులు స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు.
సభను అడ్డుకోవద్దు: అద్వానీ
కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు, పురందేశ్వరి, చిరంజీవి, కిల్లి కృపారాణి సోమవారం బీజేపీ అగ్రనేత అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ ప్రాంతానికి తగిన ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేలా సహకరించాలని, తమ ప్రాంత ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు అద్వానీని కోరారు. అద్వానీ సానుకూలంగా స్పందించారు. అలాగే, పార్లమెంటు సాంప్రదాయాలను కాలదన్ని వెల్‌లో నిరసనలకు దిగడం సరికాదని, సభను అడ్డుకోవద్దని అద్వానీ వారికి సూచించారు. ఈ భేటీలో మరో కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొనలేదు.
బిల్లు ప్రవేశపెట్టినట్టు అంగీకరించొద్దు: సీమాంధ్ర మంత్రులు
Published Tue, Feb 18 2014 2:21 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement