నా క్రికెట్ హీరో సెహ్వాగ్ ఇలా మాట్లాడేమిటి?
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌మెహర్ కౌర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. తన క్రికెట్ హీరో సెహ్వాగ్.. గుర్‌మెహర్‌పై చేసిన వ్యాఖ్యలు తనకు నిరాశ కలిగించాయని, సీరియస్ అంశమైన యుద్ధాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యానించాడని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు.
కార్గిల్ అమరవీరుడి కుమార్తె అయిన గుర్‌మెహర్ తెలిసీ తెలియని వయసులో వ్యాఖ్యలు చేసిందని, ఆమె వ్యాఖ్యలు ఆవేశపూరితంగా ఉండవచ్చని, అంతమాత్రాన వారి కుటుంబాన్ని తక్కువ చేసేలా మాట్లాడటానికి మనమెవరని, కుటుంబపెద్దను పోగొట్టుకున్న బాధలో వారు స్పందించారని వీరూను ఉద్దేశించి శశిథరూర్ పేర్కొన్నారు. ఓ యువతి భావజాలంపై మీ శక్తివంతమైన పదాలను ప్రయోగించేందుకు సాహసించరాదని వీరూకు సూచించారు.
కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్‌మెహర్.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. పలువురు సెలెబ్రిటీలు కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో స్పందించారు. దీనిపై గుర్‌మెహర్ స్పందిస్తూ వీరూ వ్యాఖ్య తన గుండెను బద్దలు చేసిందని పేర్కొనగా.. తన వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశిస్తూ చేసినవి కావని సెహ్వాగ్ వివరణ ఇచ్చాడు. ఏబీవీపీపై సంచలన ఆరోపణలు చేసిన గుర్‌మెహర్ చివరకు సోషల్ వార్‌కు స్వస్తి చెబుతున్నట్టు పేర్కొంది.