కొత్త ఏజీగా ముకుల్ రోహత్గీ
న్యాయశాఖ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: నూతన అటార్నీ జనరల్ (ఏజీ)గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ గురువారం నియమితులయ్యూరు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఎన్డీయే ప్రభుత్వ అత్యున్నత న్యాయూధికారిగా రోహత్గీని నియమిస్తూ న్యాయశాఖ లాంఛనంగా నోటిఫికేషన్ జారీ చేసింది. జి.ఇ.వాహనవతి స్థానంలో భారత 14వ ఏజీగా రోహత్గీ బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వాహనవతి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వం మారినప్పుడు న్యాయూధికారులు తమ పదవుల నుంచి వైదొలగడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో భారత సొలిసిటర్ జనరల్‌గా ర ంజిత్ కుమార్‌ను కేంద్రం ఇప్పటికే నియమించింది. ఆరుగురు అదనపు సొలిసిటర్ జనరల్స్ కూడా నియమితులయ్యూరు. రోహత్గీ గత ఎన్డీయే ప్రభుత్వ హయూంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గానే సేవలందించారు. సుప్రీంకోర్టులోని పిటిషన్లను ఓ గాడిన పెట్టడమే తన తొలి ప్రాధాన్యతగా రోహత్గీ ఇటీవల చెప్పారు.
ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి అవధ్ బేహారీ రోహత్గీ కుమారుడైన ముకుల్ రోహత్గీ ముంబై విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసు సహా పలు కేసులను గుజరాత్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. ఢిల్లీలో నివసించే ఈయనకు కార్పొరేట్ లాయర్‌గా కూడా పేరుంది.