సెన్సెక్స్ 132 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ 132 పాయింట్లు డౌన్
Published Fri, Oct 18 2013 3:49 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM
ముంబై: అమెరికా షట్‌డౌన్ సమస్యకు పరిష్కారం లభించినప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం నష్టపోయాయి. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ 132 పాయింట్లు నష్టపోయి 20,415 వద్ద ముగిసింది. ఈ నెలలో ఇంత ఎక్కువగా నష్టపోవడం ఇదే మొదటిసారి. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 6,046 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే మెరుగ్గా 20,579 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత 20,630 స్థాయిని తాకింది. ఆ తర్వాత 20,375కి క్షీణించి, చివరికి 132 పాయింట్ల నష్టంతో 20,415 వద్ద ముగిసింది. లాభాల స్వీకరణతో క్షీణించిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు.. మార్కెట్‌ను కుంగదీయగా, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ వంటి దిగ్గజాలు కాస్త ఊతంగా నిల్చాయి. రంగాల వారీగా 13 బీఎస్‌ఈ సూచీల్లో 9 నష్టపోయాయి. ఐటీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
టీసీఎస్ 4.98%, టాటా మోటార్స్ 4.03%, లార్సన్ అండ్ టూబ్రో 3.73%, విప్రో 3%, ఇన్ఫోసిస్ 2.34 శాతం తగ్గాయి. మొత్తం మీద 1,248 షేర్లు నష్టాల్లోనూ, 1,209 షేర్లు లాభాల్లోనూ క్లోజయ్యాయి. బీఎస్‌ఈలో టర్నోవరు రూ. 1,935 కోట్లుగా నమోదైంది. ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌లో టర్నోవరు రూ. 1,41,081 కోట్లుగాను, ఈక్విటీస్‌లో రూ. 12,149 కోట్లుగాను నమోదైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ. 1,110 కోట్ల షేర్లు కొనుగోలు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ. 1,149 కోట్ల షేర్లు విక్రయించారు. అమెరికా షట్‌డౌన్ సమస్య పరిష్కారానికి డీల్ కుదరడంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా కనిపించాయని, అయితే దేశీయంగా మాత్రం అమ్మకాల ఒత్తిడి నెలకొందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ ఆనలిస్ట్ నిధి సారస్వత్ తెలిపారు. ఆసియా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది. దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, తైవాన్ లాభపడగా.. షాంఘై కాంపోజిట్, హాంగ్ సెంగ్ సూచీలు నష్టపోయాయి.
Advertisement
Advertisement