‘సెన్సెక్స్’ప్రెస్...ముహూరత్ మెరుపులు | Sensex touches record high on Muhurat trading | Sakshi
Sakshi News home page

‘సెన్సెక్స్’ప్రెస్...ముహూరత్ మెరుపులు

Published Mon, Nov 4 2013 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

‘సెన్సెక్స్’ప్రెస్...ముహూరత్ మెరుపులు

‘సెన్సెక్స్’ప్రెస్...ముహూరత్ మెరుపులు

ముంబై: స్టాక్ మార్కెట్లో దీపావళి వెలుగులు జిగేల్‌మన్నాయి. రెండు రోజుల ముందే గత రికార్డును వెనక్కినెట్టి రంకేసిన బుల్.. దీపావళి సందర్భంగా ఆదివారం జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో మరింత దూకుడు ప్రదర్శించింది. ‘సంవత్ 2070’ హిందూ కొత్త సంవత్సరంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ఆరంభించి.. ఆల్‌టైమ్ రికార్డును తాకింది. శుక్రవారం 21,294 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసి(2008 జనవరి ఆల్‌టైమ్ హై 21,207)న బీఎస్‌ఈ సెన్సెక్స్.. ఆదివారం జరిగిన 75 నిమిషాల(సాయంత్రం 6.15 నుంచి 7.30 వరకూ) ట్రేడింగ్‌లో మరో కొత్త గరిష్టానికి ఎగసింది. ఇంట్రాడేలో 21,322 పాయింట్లను చేరింది. చివరకు గత ముగింపు 21,197 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్లు లాభపడి 21,239 వద్ద స్ధిరపడింది. ముగింపు పరంగా ఇదో కొత్త రికార్డు కావడం గమనార్హం. బీఎస్‌ఈలోని 13 రంగాల సూచీల్లో 12 సూచీలు 0.1-0.78 శాతం మధ్య లాభాలతో ముగియడం మరో విశేషం. మొత్తం మీద దేశీ స్టాక్ మార్కెట్లు ఐదో రోజూ లాభాల్లోనే నిలిచాయి.

 

 ఆల్‌టైమ్ హైకి అతి చేరువలోకి నిఫ్టీ....

 సెన్సెక్స్ కొత్త మైలురాళ్ల దిశగా దూసుకెళ్తుంటే.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంకా గత రికార్డును ఛేదించేందుకు వెనకాముందూ ఆడుతోంది. ఆదివారం ప్రత్యేక ట్రేడింగ్‌లో ఒకానొకదశలో నిఫ్టీ 6,343 పాయింట్లను తాకి.. గత రికార్డు(2008 జనవరిలో 6,357)కు అతి చేరువలోకి వచ్చింది. అయితే, చివరకు 10 పాయింట్లు లాభపడి 6,317 వద్ద క్లోజైంది. అయితే, ఇది ఆల్‌టైమ్ హై ముగింపు(గతంలో  2010, నవంబర్ 5న 6,312 పాయింట్లు ఇప్పటిదాకా ఆల్‌టైమ్ హై క్లోజ్) కావడం గమనార్హం. సెన్సెక్స్ 30 స్టాక్స్ జాబితాలో 22 లాభపడ్డాయి. ఇక టాటా మోటార్స్ అత్యధికంగా 1.74% పుంజుకోగా, జిందాల్ స్టీల్(1.13%), సన్ ఫార్మా(0.95) మారుతీ(0.86%) ఈ జాబితాలో ఉన్నాయి.

 

 నేడు మార్కెట్లకు సెలవు

 దీపావళి-బలిప్రతిపదను పురస్కరించుకొని స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఫారెక్స్, మనీ మార్కెట్లకు నేడు

 (సోమవారం) సెలవు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement