జీఎస్టీ బూస్ట్తో తేరుకున్న మార్కెట్లు
ముంబై : దేశమంతటినీ ఏకీకృత పన్ను విధానంలోకి తీసుకొస్తూ రాజ్యసభ ఆమోదించిన జీఎస్టీ బిల్లు నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 100కు పైగా పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 21.10 పాయింట్ల లాభంతో 27,710 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 0.25 లాభంతో 8,545 దగ్గర కొనసాగుతోంది. జీఎస్టీ బిల్లు చర్చ నేపథ్యంలో బుధవారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో, నిన్నటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 27,700 పాయింట్లు, నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ బిల్లుకు రాజ్యసభ ఓకే చెప్పడంతో నేటి ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్లు కొంత తేరుకున్నాయి.. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్స్, ఆటో స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ ప్రారంభంలో లాభాల్లో నడిచింది.
టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హీరో, బీహెచ్ఈఎల్, మారుతీ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా.. లుపిన్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీలు సెన్సెక్స్లో నష్టాలను గడిస్తున్నాయి. అటు సింగపూర్ స్టాక్ ఎక్చ్సేంజ్ కూడా పాజిటివ్ ట్రేడ్ అవుతుండటంతో, మార్కెట్లు లాభాల బాట పట్టినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియన్ మార్కెట్లు మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి.
అటు డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 0.24 పైసలు బలహీనపడి 66.98గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.175 పడిపోయి రూ.31,600వద్ద నమోదవుతోంది.