గురుకులాల ఏర్పాటుకు సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గురుకుల పాఠశాలల ఏర్పాటు పథకానికి సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి 10 చొప్పున.. 1,190 గురుకులాలను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటి ద్వారా కేజీ నుంచి పీజీ వరకు ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.
బుధవారమిక్కడ కొత్త విద్యావిధానం అమలు తీరుతెన్నులపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు. బాలికా విద్య కోసం కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. కొత్త విద్యా విధానం ద్వారా ్రైపైవేటు, ప్రభుత్వ పాఠశాలల మధ్య అంతరం మరింత పెరిగే ప్రమాదం ఉందని, దీనిపై ప్రాథమిక, ఉన్నత పాఠశాల, సాంకేతిక విద్యాసంస్థల విభాగంలో ఉప కమిటీలు ఏర్పాటు చేసి సంప్రదింపులు చేస్తే బాగుంటుందని సూచించారు. తాము సంప్రదింపుల ప్రక్రియను వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో మొదలుపెడతామని చెప్పారు.
విద్యాహక్కు చట్టం ద్వారా లాభనష్టాలున్నాయని, వాటిని సమీక్షించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల నుంచి 25 శాతం పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించి, వారి ఖర్చులను ప్రభుత్వమే తిరిగి చెల్లించే ప్రక్రియలో అవినీతికి ఆస్కారముంటుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు బడులకు చెల్లించే డబ్బును ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఉపాధ్యాయుల భర్తీ, అత్యున్నత శిక్షణకు వినియోగిస్తే సర్కారు బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. తెలంగాణలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు.
ఆ విషయం తెలియదు
నాయకులు, అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజ్యాంగపరంగా అమలు చేయవచ్చో.. లేదో..? న్యాయపరంగా ఎలా ఉంటుందో తనకు తెలియదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అడిగిన ప్రశ్నకు కడియం బదులిచ్చారు. దీనివల్ల సమస్యకు పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాల్లో యోగ్యులైన టీచర్లున్నారని, సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదన్నారు.