మందుపాతరకు ఏడుగురు పోలీసుల బలి
బీహార్‌లో మావోయిస్టుల ఘాతుకం
ఔరంగాబాద్/పాట్నా: బీహార్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. ఔరంగాబాద్ జిల్లాలోని చంద్రాగఢ్ మోరె (సర్కిల్) సమీపంలో తాండ్వా-నబీనగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం పోలీసు జీపును మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో తాండ్వా పోలీసు స్టేషన్ ఆఫీసర్ ఇన్‌చార్జి అజయ్ కుమార్ సహా ఏడుగురు పోలీసులు మృతిచెందారు. నబీనగర్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో సమావేశానికి హాజరై పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఈ దాడికి తెగబడినట్లు అదనపు డీజీపీ (హెడ్‌క్వార్టర్స్) రవీంద్ర కుమార్ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్పెషల్ ఆక్సిలరీ పోలీసు విభాగానికి చెందిన వారితోపాటు జీపు డ్రైవర్ అయిన హోంగార్డు కూడా ఉన్నట్లు చెప్పారు.
పేలుడు అనంతరం ఘటనాస్థలి వద్ద పోలీసులకు చెందిన ఐదు రైఫిళ్లు కనిపించాయన్నారు. మావోయిస్టుల దాడి వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్.కె. భరద్వాజ్ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. జార్ఖండ్‌లోని పాలము జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఔరంగాబాద్ జిల్లా మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డగా ఉంటోంది.
21 మంది మావోయిస్టుల ఆస్తులు అటాచ్
దేశంలోనే తొలిసారిగా బీహార్‌లో 21 మంది మావోయిస్టులకు చెందిన స్థిరచరాస్తులను నితీశ్ సర్కారు మంగళవారం అటాచ్ చేసింది. ఇందుకు సంబంధించి అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు 39 కేసులు సిద్ధం చేయగా ప్రభుత్వం 21 కేసుల్లో అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్‌జీ భార్యకు చెందిన రూ. 25 లక్షల విలువైన స్థలం కూడా ఈ జాబితాలో ఉంది.