ఊళ్లు..కన్నీళ్లు.. | Severe drought conditions are dry crops | Sakshi
Sakshi News home page

ఊళ్లు..కన్నీళ్లు..

Published Sun, Aug 9 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

ఊళ్లు..కన్నీళ్లు..

ఊళ్లు..కన్నీళ్లు..

కరువు మింగిన బతుకులు
పంటలకు ఉరి!

 
హైదరాబాద్/నెట్‌వర్క్: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయి. నెలన్నరగా వర్షాలు లేకపోవడంతో లక్షలాది ఎకరాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు చేనులోనే మాడిపోతున్నాయి. ఖరీఫ్‌లో సాధారణంగా 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవడంతో జూలై మొదటివారానికే 75.2 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం వీటిలో సగానికి పైగా ఎండిపోయాయి. 40.4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తే.. సుమారు 23 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 26.47 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు కేవలం 5.42 లక్షల (21%) ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. చాలాచోట్ల పొలాలను బీడు భూములుగా వదిలిపెట్టారు. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.45 లక్షల ఎకరాలు కాగా.. ఏకంగా 6.25 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. కానీ జూలై నుంచి వర్షాలు ముఖం చాటేయడంతో దాదాపు 5 లక్షల ఎకరాల్లో మొక్క దశలోనే ఎండిపోయింది. పంటలు చేతికి వచ్చేట్లు లేకపోవటంతో రైతుల్లో దిగులు మొదలైంది. అధికారిక సమాచారం ప్రకారమే జూన్ 15 నుంచి తెలంగాణ జిల్లాల్లో సగటున రోజుకు ఒకరు చొప్పున బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో అన్నపూర్ణగా పేరొందిన కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయా పంటలు ఎండిపోయాయి. ఈ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే దాదాపు 3.75 లక్షల ఎకరాల్లో పంటలే వేయలేదు.

వానల్లేక దాదాపు 90 వేల ఎకరాల్లో వరి నార్లు ముదిరిపోయాయి. పాలమూరు జిల్లాలో 13.27 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తే.. 3.60 లక్షల ఎకరాల్లో ఎండి పోయాయి. మెదక్ జిల్లాలో 10.8 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 6.9 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో వరి సాగుకుగాను.. 70 వేల ఎకరాల్లో సాగైంది. అందులో దాదాపు 25 వేల ఎకరాల్లో వరి దెబ్బతింది. అత్యధికంగా 3.17 లక్షల ఎకరాల్లో సాగు చేసిన సోయాబీన్.. మూడొంతుల మేర ఎండిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లాలో ఈ నెలలో వర్షాలు పడకుంటే ఇప్పటివరకు సాగైన పంటల్లో 20 శాతానికిపైగా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురిసినా సాగుకు అనువైన పరిస్థితులు ఏర్పడలేదు. నల్లగొండ జిల్లాలో పంటలు మొలకెత్తే దశలోనే ఎండిపోయాయి. పత్తి దారుణంగా దెబ్బతింది. రంగారెడ్డి జిల్లాలో పత్తి, మొక్కజొన్న, కంది, వరి సాధారణ విస్తీర్ణానికి చేరువైనా.. వర్షాల్లేక మొక్క దశలోనే ఎండిపోయాయి.
 
 
కరుణించని వరుణుడు
ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే చాలా జిల్లాల్లో సగానికంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఐదు జిల్లాల్లో అత్యల్పంగా వర్షపాతం నమోదుకాగా.. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయి. కేవలం ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మాత్రమే సరైన స్థాయిలో వర్షాలు కురిశాయి. సగటున తెలంగాణవ్యాప్తంగా 27 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహాయించి 9 జిల్లాల్లో 443 మండలాలు ఉండగా... 268 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. వీటిలో 54 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని వ్యవసాయ శాఖ తాజాగాప్రభుత్వానికి నివేదించింది.

 ముందు ముందు కష్టమే
 ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు కురిసే అవకాశాలు అంతంత మాత్రమేనని వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఆగస్టు, సెప్టెంబర్‌లో తేలికపాటి, అడపాదడపా జల్లులు మినహాయిస్తే సరైన వర్షాలు కురిసే అవకాశం లేదు. వర్షాభావ పరిస్థితులే కొనసాగుతాయి. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అదే దుస్థితి ఏర్పడే అవకాశముంది..’’ అని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి పేర్కొన్నారు.
 
 రాజధానికి కన్నీటి కష్టాలే!
దాదాపు కోటి మంది జనాభాతో మహానగరంగా మారిన రాష్ట్రరాజధాని హైదరాబాద్‌కు కన్నీటి కష్టాలు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు భూగర్భ జలాలు పాతాళానికి చేరిపోయాయి. హైదరాబాద్‌లో జూలై చివరి నాటికి సాధారణంగా 183 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 98 మిల్లీమీటర్లే నమోదుకావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 23 లక్షల బోరుబావులు ఉన్నాయి. భూగర్భ జలాలు గతేడాది జూలై చివరలో సగటున 9.59 మీటర్ల లోతున ఉండగా... ఈ సారి ఏకంగా 11.21 మీటర్ల లోతుకు అంటే 1.63 మీటర్లు పడిపోయాయి. అదే ప్రాంతాల వారీగా చూస్తే నాంపల్లిలో అత్యధికంగా 6.75 మీటర్లు పడిపోగా, మారేడ్‌పల్లిలో 4.25 మీటర్లు, ఖైరతాబాద్‌లో 1.55 మీటర్లు, ఆసిఫ్‌నగర్‌లో 4.37 మీటర్లు, మహేశ్వరంలో 3.15 మీటర్లు తగ్గిపోయాయి. దీంతో నీటికి తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ నగరానికి నీరందించే జలాశయాల్లోనూ నీటిమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలో ఉన్న నీరు మరో నెలరోజులపాటు మాత్రమే సరిపోతుందని జలమండలి వర్గాలు తెలిపాయి. వీటిల్లో నిల్వలు అడుగంటడంతో కృష్ణాజలాలపైనే ఆధారపడాల్సి వస్తోందని, సింగూరు, మంజీరా, అక్కంపల్లి (కృష్ణా), నాగార్జునసాగర్ జలాశయాల్లోనూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నాయి. మొత్తంగా అన్ని జలాశయాల నుంచి రోజువారీగా 366.90 ఎంజీడీల నీటిని సేకరించి శుద్ధిచేసి 8.64 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నామని తెలిపాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సెప్టెంబర్‌లో నీటికి తీవ్ర కటకట తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
పాతాళానికి నీళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా 2.08 మీటర్లు తగ్గిపోయిన జలాలు మెదక్ జిల్లాలో 6.45 మీటర్లు, నిజామాబాద్‌లో 4.61 మీటర్లు కిందికి సాధారణంగా ఆగస్టులో వర్షాలు కురిసి భూగర్భజల మట్టం పెరుగుతుంది. కానీ తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి, బోర్లు వట్టిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరతతో ప్రజానీకం అల్లాడుతోంది. వరంగల్ జిల్లాలో వందకు పైగా గ్రామాల్లో జనం తాగునీటికి అల్లాడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 1,055 గ్రామాలు ఉండగా... నీటి ప్రాజెక్టులు లేకపోవడంతో పశ్చిమ ప్రాంత ప్రజలకు బోరుబావుల ద్వారా సరఫరా జరుగుతోంది. తూర్పు http://img.sakshi.net/images/cms/2015-08/41439060055_Unknown.jpgప్రాంతంలోని మూడువందల గ్రామాలకు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ వర్షాభావంతో జలాశయాలు అడుగంటడం, భూగర్భజలాలు పడిపోవడంతో నీటికి కటకట వచ్చింది. నల్లగొండ జిల్లాలోనూ అదే పరిస్థితి. భువనగిరి, దేవరకొండ ప్రాంతాల్లో చుక్కనీరు దొరికే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఆసిఫాబాద్ మండలంలో భూగర్భ జలాలు గత జూలైలో 19.35 మీటర్ల లోతులో ఉండగా.. ఇప్పుడు 22.03 మీటర్లకు పడిపోయాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో 20.8 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఖమ్మం జిల్లాలో చండ్రుగొండ, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, టేకులపల్లి, ఖమ్మం రూరల్,  వెంకటాపురం మండలాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం పుల్లూరులో అత్యధికంగా 63.26 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. సిద్దిపేట, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆందోల్, మెదక్ నియోజకవర్గాల్లో భూగర్భ జలమట్టాలు ఆందోళనకరస్థాయిలో ఉన్నాయి.
 
శ్రీశైలంతో ఆటలు.. తాగునీటి కటకటకు ప్రభుత్వాల తప్పిదాలే కారణం

 శ్రీశైలం ప్రాజెక్టుతో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకున్నాయి. తాగు, సాగు కోసం వాడుకోవాల్సిన నీటిని విద్యుదుత్పత్తికోసం ఎడాపెడా వాడేసుకున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయనే హెచ్చరికలను బేఖాతరు చేసి.. నిండుగా ఉన్న ప్రాజెక్టును పోటీపడి మరీ ఖాళీ చేశాయి. ఇదే ఇప్పుడు తాగునీటి కటకటకు దారితీసింది. 2014లో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది పోటెత్తింది. శ్రీశైలం గేట్లు ఎత్తాల్సినంత వరద వచ్చిచేరింది. రాయలసీమ తాగు, సాగు అవసరాలకు ఆధారమైన శ్రీశైలం నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన ఏపీ... అందుకు భిన్నంగా విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం 860 అడుగులకు పడిపోయిన తర్వాత.. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ వివాదాన్ని తెరమీదకు తెచ్చింది. 854 అడుగుల మట్టాన్ని కాపాడితే తప్ప సీమకు నీళ్లివ్వలేమనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం మరిచిపోయిన తీరు పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.

పంతాలకు పోయి: శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ ఆధీనంలో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం 2014 సెప్టెంబర్‌లో ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టడంతో వివాదం మొదలైంది. వరద నీటిని మాత్రమే ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలనే నిబంధనను ఉల్లంఘించడాన్ని ఏపీ తీవ్రంగా పరిగణించి... తెలంగాణపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. బోర్డు కూడా సీరియస్‌గానే స్పందించి, విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణను ఆదేశించింది. ఈ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు. ఎండాకాలం రాకముందు విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడిన ఇరు రాష్ట్రాలు అంతటితో ఆగిపోలేదు. వేసవి ప్రారంభమైన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ కుడిగట్టున విద్యుత్ ఉత్పత్తి చేసింది. దీనికి తెలంగాణ కూడా జత కలిసింది. విద్యుత్ ఉత్పత్తి వివాదం సమసిపోకపోవడం, పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు చొరవ చూపకపోవడంతో.. వేసవి మొదలైన తర్వాత కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది. ఈ ఏడాది మార్చి 1న శ్రీశైలంలో నీటిమట్టం 833.9 అడుగులకు చేరింది. 834 అడుగుల కనీస నీటిమట్టాన్ని కాపాడాలని నిబంధన ఉంది. గతంలో హైకోర్టు కూడా ఈమేరకు తీర్పు ఇచ్చింది. తాగునీటి అవసరాలకు మినహా మిగతా అవసరాలకు 834 అడుగుల దిగువన నీటిని వాడుకోకూడదు. కానీ విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు ఎడమ గట్టున తెలంగాణ, కృష్ణపట్నం ప్లాంటులో సాంకేతిక సమస్య వచ్చిందనే సాకుతో కుడిగట్టున ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి చేశాయి. ఫలితంగా ప్రాజెక్టులో నీటిమట్టం 800 అడుగుల కిందికి పడిపోయింది. శ్రీశైలంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న జలాల్లో 8 టీఎంసీలను తాగునీటి కోసం వాడుకోవాలని.. ఈ నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేసి అక్కడి నుంచి ఇటు తెలంగాణ, అటు కోస్తా తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ నీటితో మరో 15 రోజులు తాగునీటి అవసరాలను తీర్చుకోగలిగినా... అప్పటికీ వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement