మహాత్మాగాంధీపై షా వివాదాస్పద వ్యాఖ్యలు!
రాయ్‌పూర్: మహాత్మాగాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైశ్యకులాన్ని ఉద్దేశిస్తూ ఆయన తెలివైన వ్యాపారి (చతుర్ బనీయా) అని షా అభివర్ణించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాతిపితను, స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించడమేనని, ఇందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా.. తన వ్యాఖ్యలను షా సమర్థించుకున్నారు.
రాయ్‌పూర్‌లో అమిత్ షా మాట్లాడుతూ ఎలాంటి సిద్ధాంతభూమిక లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందని, దేశ స్వాతంత్ర్య సాధన కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. అందుకే స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీ కోరుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ను రద్దు చేసే పనిని నాడు గాంధీజీ చేయలేకపోయినా, నేడు కొందరు ఆ పనిని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీని సంకుచితరీతిలో పోల్చడం ద్వారా ఆయనను అమిత్ షా అవమానించారని, షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.