
ఆ విషయం తెలియగానే షాకయ్యా: మమత
కోల్కతా: అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ను నిర్బంధించడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఈ విషయం తెలియగానే తాను షాకయ్యానని, ఈ ఘటన చాలా దురదృష్టకరమని, అమానవీయమని అన్నారు. భద్రత ముఖ్యమని, అలాగని తనిఖీల పేరిట వేధించడం తగదని మమత ట్వీట్ చేశారు.
అమెరికాలో యాలె యూనివర్శిటీని సందర్శించేందుకు వెళ్లిన షారుక్ను లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విచారణ పేరుతో దాదాపు రెండు గంటలు అదుపులో ఉంచుకుని తర్వాత వదిలిపెట్టారు. దీనిపై షారుక్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఈ ఘటనపై స్పందిస్తూ షారుక్కు క్షమాపణలు చెప్పారు.