యూపీఎ పక్షాలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలి: శరద్‌పవార్
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం వెలుబడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ భావించినా తరుణంలో బీజేపీ ప్రభావానికి కాంగ్రెస్ విలవిలలాడింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూపీలో ముసలం పుట్టిందంటూ పవార్ మండిపడ్డారు.
కాంగ్రెస్‌లో బలహీనమైన నాయకత్వం ఉందని, అందుచేత బలహీన నాయకత్వాన్ని ప్రజలు ఇష్టపడరన్నారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పరాజయం కావడంతో కాంగ్రెస్ ఇంకా బలహీనపడిపోయిందని చెప్పారు. తాజా ఫలితాల నుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజలు మనపై ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై యూపీఎ పక్షాలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ శరద్ పవార్ సూచించారు.