షరపోవా మోసగత్తె.. జీవితకాలం నిషేధమే సరి!
డోపింగ్ ఆరోపణలతో 15 నెలలు నిషేధానికి గురైన టెన్నిస్ స్టార్ మరియా షరపోవా పునరాగమనంలోనూ సత్తా చాటింది. 15 నెలల నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో ఆమె విజయం సాధించింది. రాబెర్టా విన్సీని 7-5, 6-3 తేడాతో చిత్తుగా ఓడించింది.
ఐదు గ్రాండ్‌స్లామ్‌ల విజేత, మాజీ నంబర్ 1 అయిన ఆమెకు ఈ మ్యాచ్ వీక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ఘనమైన స్వాగతం పలికారు. అయితే, ఆమె పునరాగమనంపై కెనడా టెన్నిస్ స్టార్ యూజినీ బౌచర్డ్ ఫైర్ అయింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన ఆమెను మళ్లీ ఆడేందుకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది.
‘ఇది సరికాదు. ఆమె ఒక మోసగత్తె. ఏ క్రీడలో అయిన మోసగాళ్లను మళ్లీ ఆడనివ్వకూడదు. ఇలా ఆడనివ్వడం ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేయడమే. ప్రపంచ టెన్నిస్ సమాఖ్య ఈ విషయంలో తప్పుడు సంకేతాలు ఇస్తోంది. మోసం చేసిన వాళ్లను కూడా తిరిగి ఘనంగా ఆహ్వానిస్తారనే తప్పుడు సంకేతాలు ఈ చర్చ వల్ల పిల్లలకు వెళ్లే అవకాశముంది. షరపోవాకు జీవితకాల నిషేధమే సరైన శిక్ష’ అని యూజినీ అభిప్రాయపడింది. షరపోవా పునరాగమనంపై పలువురు ఇతర టెన్నిస్ స్టార్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.