
ఓరుగల్లులో జనయాత్ర
వైఎస్ తనయకు ఆత్మీయ స్వాగతం పలికిన వరంగల్
► మహానేత జ్ఞాపకాలతో ఉద్వేగానికి గురైన జనం
► నాలుగో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించిన షర్మిల
► నేడు జిల్లాలో ముగియనున్న మొదటి దశ యాత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: అదే చిరునవ్వు. అదే ఆప్యాయత. అచ్చం రాజన్నలాగే ధైర్యం చెబుతూ, ఆయన మళ్లీ వచ్చాడా అనిపిస్తూ... ఆయన తనయ షర్మిల పరామర్శ యాత్ర గురువారం నాలుగో రోజు వరంగల్ నగరంలో జనయాత్రలా కొనసాగింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వస్తున్న విషయం తెలుసుకున్న ప్రజలు ఆమెను చూడటానికి బారులు తీరారు. ఆత్మీయంగా స్వాగతం పలికారు. వైఎస్ అకాల మరణంతో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్టే అయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మీ నాయన మాకు చేసిన మేలు మాటల్లో చెప్పలేమమ్మా. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో మాకందరికీ దగ్గరయ్యారు.
ఆయన పోయాక అంతా మారిపోయింది’’ అని దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య భార్య రాధ షర్మిలతో అన్నారు. ‘‘మా అత్తకు పింఛను వస్తలేదు. మాకు ప్రభుత్వ ఇండ్లు రాలేదు. వైఎస్ ఉంటే ఇవన్నీ జరిగేవమ్మా. ఇంత దూరం మాకోసం వచ్చిన నిన్ను మరువమమ్మా’ అని భావోద్వేగంతో అన్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం షర్మిల ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఖాజీపేటలోని బాలవికాస ఆవరణ నుంచి పెద్దమ్మగడ్డ, పోచమ్మ మైదాన్, దేశాయిపేట, కాశిబుగ్గ, ఉర్సు, మరియపురం, ఊకల్‌హవేలీల్లో షర్మిల జరిపిన 68 కిలోమీటర్ల యాత్రకు భారీ స్పందన వచ్చింది. వందలాది మోటారు వాహనాలతో యువకులు స్వాగత ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ షర్మిల ముందుకు సాగారు. వరంగల్ నగరమంతటా భారీ స్పందన రావడంతో షర్మిల యాత్రకు ఎక్కువ సమయం పట్టింది. జిల్లాలో శుక్రవారంతో పరామర్శ యాత్ర తొలి దశ ముగియనుంది.
ఓపికతో.. ఓదార్చుతూ..
‘‘అమ్మా! మీ నాయన ఎప్పుడు చనిపోయారు? అన్నయ్య ఎలా చనిపోయాడు? మీరేం చేస్తున్నారు?’’ అంటూ హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన తీగల చిరంజీవి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. 30 నిమిషాలు వారితో ముచ్చటించారు. చిరంజీవి సోదరుడు అనిల్ ఏడు నెలల కొడుకు మన్విత్‌ను ఒళ్లోకి తీసుకుని లాలించారు. అనంతరం వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ చరిత్రాత్మక పాదయాత్రలో తానూ పాల్గొన్నానని సక్కుబాయి కుమారుడు భాస్కర్ చెప్పారు. అనంతరం కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
కొమురయ్య కొడుకు శివకుమార్, కూతుళ్లు భారతి, రాధిక, అనిత, రజనిలను పేరుపేరునా పలకరించి ఓదార్చారు. వారు ఏం చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. కొమురయ్య మనవలు, మనవరాళ్లకు చాక్లెట్లిచ్చారు. అనంతరం కాశిబుగ్గలో నాగవెళ్లి వీరస్వామి కుటుంబీకులను కలుసుకున్నారు. రాజన్న కుటుంబమంతా అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. ‘అవ్వా బాధ పడొద్దు. ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఆయన భార్య సుభాషిణికి ధైర్యం చెప్పారు. అనంతరం ఉర్సులో రామ సుదర్శన్ ఇంటికి వెళ్లారు. ఆయన భార్య భారతిని ఓదార్చారు. వారామెకు ఆప్యాయంగా బొట్టు పెట్టి స్వాగతం పలికారు. తర్వాత మరియపురంలో బిట్ల రాజ్యలక్ష్మి కుటుంబీకులను పరామర్శించారు. ఆమె కోడలు సత్తెమ్మ తదితరులకు ధైర్యం చెప్పారు.
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మతిన్ ముజదాది, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.ప్రసాదరాజు, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, సాదు రమేశ్‌రెడ్డి, పి.ప్రపుల్లారెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్‌రావు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, బి.బ్రహ్మానందరెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, షర్మిల సంపత్, జి.జైపాల్‌రెడ్డి, ఎం.శంకర్, సలీం, కె.వెంకట్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, బి.సంజీవరావు, జి.శివకుమార్, డోరెపల్లి శ్వేత, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, టి.నాగరావు, ఎం.సంతోష్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్న గౌడ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముందే వచ్చిన రాఖీ పండుగ
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగ వరంగల్ జిల్లాలో రెండు రోజుల ముందుగానే వచ్చింది. గురువారం గీసుగొండ మండలం ఊకల్‌హవేలీలో ఓదెల సరస్వతి ఇంటికి షర్మిల వెళ్లారు. సరస్వతి కుమారులు శ్రీకాంత్, రాజ్‌కుమార్ తమకు రాఖీ కట్టాలని షర్మిలను కోరారు. ఆమె వెంటనే రాఖీలు తెప్పించి కట్టడంతో, షర్మిలమ్మ పెద్దక్కలా తమ ఇంటికి వచ్చారంటూ సంబరపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉమారెడ్డి అనే యువకుడు కూడా ‘అక్కా రాఖీ కట్టవా’ అని కోరడంతో అతనికి కూడా షర్మిల రాఖీ కట్టారు.