యూపీ సీఎం అభ్యర్థిగా షీలాదీక్షిత్
ఖరారు చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోం ది. అపార అనుభవమున్న నాయకురాలు షీలాదీక్షిత్‌ను సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది. వరుసగా మూడుసార్లు ఢిల్లీకి సీఎంగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన షీలా పేరును ఖరారు చేస్తూ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, మరో నాయకుడు జనార్దన్ ద్వివేదీతో కలసి గురువారమిక్కడ ప్రకటన చేశారు. యూపీలో ప్రభావం చూపగల స్థాయిలో బ్రాహ్మణులున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన షీలా అభ్యర్థిత్వం రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని అధిష్టానం భావిస్తోంది.
ఏసీబీ విచారణ ఎదుర్కొం టున్న షీలాదీక్షిత్‌ను ఎలా ఎంపిక చేశారని ఆజాద్‌ను ప్రశ్నించగా... ఛత్తీస్‌గఢ్, రాజ స్థాన్, మధ్యప్రదేశ్ సీఎంలతో పాటు మహారాష్ట్రలోని చాలామంది బీజేపీ మం త్రులపై కూడా అవినీతి ఆరోపణలున్నాయన్నారు. ఒకవేళ ఆ సీఎంలు రాజీనామాకు సిద్ధపడితే... తాము కూడా షీలా పేరును వెనక్కి తీసుకొంటామన్నారు. పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన 78 ఏళ్ల షీలాదీక్షిత్ యూపీలోని కాంగ్రెస్ సీనియర్‌నేత శంకర్ దీక్షిత్ కోడలు.
కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా సుదీర్ఘ కాలంపాటు ఆయన పనిచేశారు. 1984లో యూపీలోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన షీలా కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బ్రాహ్మణులకు అధిక టికెట్లు ఇచ్చి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టగలిగారు. ఈ క్రమంలో షీలా ఏ స్థాయిలో బ్రాహ్మణ ఓట్లను రాబడతారో వేచిచూడాల్సిందే.