'జరిగిందేదో జరిగిపోయింది'
ముంబై: మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా జరిగిందేదో జరిగిపోయింది మళ్లీ చేతులు కలుపుదాం అంటూ బీజేపీకి శివసేన సంకేతాలు ఇచ్చింది. ముంబైకి సమీపంలోని కల్యాన్-దొంబివాలి (కేడీఎంసీ) మున్సిపాలిటీ ఎన్నికల్లో శివసేన అత్యధిక సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ మెజారిటీ మార్క్ కు ఆ పార్టీ దూరంగా ఉండిపోయింది. మరోవైపు బీజేపీ కూడా గణనీయంగా తన సీట్లను పెంచుకొని రెండోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా పరస్పరం చేసుకున్న ఆరోపణలను పక్కనబెట్టి.. మున్సిపాలిటీ చైర్ పర్సన్ పీఠం కోసం చేతులు కలుపాల్సిన అవసరముందని బీజేపీకి శివసేన సూచించింది.
' కేడీఎంసీ ఎన్నికల ప్రచారంలో (బీజేపీ-శివసేన) పరస్పరం ఎంతో బురద జల్లుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి అంగీకరించాల్సిన అవసరముంది. ఎన్నికల సమయంలో జరిగిందేదో జరిగిపోయింది. దానిని పక్కనబెట్టి ఇప్పుడు ముందుకెళ్లాల్సిన అవసరముంది' అని శివసేన పార్టీ అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో సూచించింది. 'కల్యాణ్, దొంబివాలి మున్సిపాలిటీ అభివృద్ధికి మేం కట్టుబడ్డాం. అయినా మాకు స్వల్పంగా మెజారిటీ తగ్గింది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా సాగాలని మేం భావిస్తున్నాం' అని 'సామ్నా' పేర్కొంది.