ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమవేనని, శివసేన కూడా తమతోనే నడుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోన్న బీజేపీ ఆశలపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన నీళ్లు కుమ్మరించింది. రైతు సమస్యలు, రాఫెల్ వివాదం, ఈవీఎం లోపాలు సహా ఇటీవల బీజేపీ నేతలు చేస్తున్న ‘ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రకటన’లతో పాటు.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా విరుచుకుపడింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం దేశంలో వాడుతున్న ఈవీఎంలు, బీజేపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే లండన్, అమెరికాలో కూడా కమలం వికసించడం ఖాయమని శివసేన ఎద్దేవా చేసింది.
గెలుపు పట్ల బీజేపీ నేతలకు అంత విశ్వాసం ఉంటే అయోధ్యలో రామమందిరం ఎందుకు నిర్మించలేకపోయారని అధికార పార్టీని నిలదీసింది. అంతేకాక ‘అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేద’ని ప్రశ్నించింది. అంతేకాక ‘ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడు గెలిచిన 42 స్థానాలకంటే మరో సీటు ఎక్కువగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అది కూడా ఎన్సీపీ నేత శరద్ పవార్ కంచుకోట బారామతిలో గెలుస్తామని ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ముందు ఇలా ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసినందుకు ఫడ్నవీస్‌ను మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి విశ్వాసం ఉంటే రానున్న ఎన్నికల్లో 548 లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలవొచ్చు’ అంటూ శివసేన వ్యంగ్యంగా రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment