సీఎం యోగిని చూసి నేర్చుకోండి!
ముంబై: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ కు శివసేన సూచించింది. ప్రజా సంక్షేమం కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడింది. తన పనితీరుతో విమర్శకుల నోటికి తాళం వేశారని శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ప్రశంసించింది. రైతుల పంట రుణాల మాఫీలో మహారాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించింది.
‘రైతుల పంటరుణాలు మాఫీ చేస్తూ సీఎం యోగి తన మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పంట రుణాలు మాఫీ చేసేందుకు ఇక్కడి ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తోంది. యోగి మోడల్ అధ్యయనం తర్వాత మాఫీ చేస్తామని చెబుతోంది. మహారాష్ట్ర సర్కారుకు సీరియస్ నెస్ లేదు. సీఎం యోగిని చూసి ఇక్కడి పాలకులు నేర్చుకోవాల’ని ఫడ్నవీస్ కు శివసేన చురకలు అంటించింది.