దేశ రాజధాని నగరంలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం రేగింది. ఇంద్రలోక్ మెట్రోస్టేషన్ సమీపంలో ఓ పురుషుడు, మహిళపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు.
దేశ రాజధాని నగరంలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం రేగింది. ఇంద్రలోక్ మెట్రోస్టేషన్ సమీపంలో ఓ పురుషుడు, మహిళపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. వారిలో పురుషుడు అక్కడికక్కడే మరణించగా మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి పేరు సుందర్ అని, అతడు చెత్త వ్యాపారి అని పోలీసులు తెలిపారు.
సుందర్ తలపైన, గుండెలోను బుల్లెట్లు తగిలాయి. ఇది వ్యక్తిగత పగతో చేసిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన మహిళను హిందూరావు ఆస్పత్రిలో చేర్చారు. సరాయ్ రోహిలా పోలీసు స్టేషన్లో హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల వివరాలు పోలీసులకు తెలిశాయని సమాచారం.