shooting spree
-
ఢిల్లీ మెట్రోస్టేషన్ వద్ద కాల్పుల కలకలం
దేశ రాజధాని నగరంలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం రేగింది. ఇంద్రలోక్ మెట్రోస్టేషన్ సమీపంలో ఓ పురుషుడు, మహిళపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. వారిలో పురుషుడు అక్కడికక్కడే మరణించగా మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి పేరు సుందర్ అని, అతడు చెత్త వ్యాపారి అని పోలీసులు తెలిపారు. సుందర్ తలపైన, గుండెలోను బుల్లెట్లు తగిలాయి. ఇది వ్యక్తిగత పగతో చేసిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన మహిళను హిందూరావు ఆస్పత్రిలో చేర్చారు. సరాయ్ రోహిలా పోలీసు స్టేషన్లో హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల వివరాలు పోలీసులకు తెలిశాయని సమాచారం. -
అమెరికా స్కూల్లో కాల్పులు.. ముగ్గురికి గాయాలు
అమెరికాలో మళ్లీ స్కూల్లో కాల్పులు కలకలం రేపాయి. ఓరెగావ్ రాష్ట్రంలో ఓ హైస్కూల్ వెలుపల జరిగిన కాల్పుల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది మాఫియా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపినవాళ్లు వెంటనే అక్కడినుంచి పారిపోవడంతో వాళ్లను పట్టుకోడానికి గాలింపు మొదలైంది. గాయపడిన వాళ్లలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వాళ్లంతా స్పృహలోనే ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ఉత్తర పోర్ట్లాండ్ లోని రోజ్మేరీ ఆండర్సన్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గాయపడిన వాళ్లు వెంటనే స్కూల్లోకి పరుగులు తీశారని, వెంటనే కాల్పులు జరిపినవాళ్లు పారిపోయారని తెలిపారు. మామూలు హైస్కూళ్లలో ఫీజులు కట్టి చదువుకునే స్థోమత లేని పిల్లల కోసం సమాజంలో ఉన్నవాళ్ల విరాళాలతో ఈ పాఠశాల నడుస్తుంటుంది. కాల్పులు జరిపినవాళ్లకు మాఫియా గ్యాంగులతో సంబంధం ఉండి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
అమెరికా సిగ్గుపడాలి: ఒబామా
పాఠశాలల్లో వరుసపెట్టి కాల్పులు సంఘటనలు జరుగుతుండటంతో వాటికి ఇంతవరకు అడ్డుకట్ట వేయలేనందుకు అమెరికా సిగ్గుపడాలని సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. 18 నెలల వ్యవధిలో ఏకంగా 74 కాల్పుల సంఘటనలు అమెరికాలో జరిగాయి. ఓరెగాన్ హైస్కూల్లో 14 ఏళ్ల అబ్బాయిని కాల్చి చంపిన సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఆయనీ మాట అన్నారు. ప్రపంచంలో ఇంకెక్కడా ఇలా జరగట్లేదని, ఈ పరిస్థితి ఇక మారదా అని ఒబామా ప్రశ్నించారు. నమ్మలేనంత నష్టం కలిగించే వ్యక్తుల చేతుల నుంచి తుపాకులను దూరం పెట్టడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని, కానీ ఈ సమాజం మాత్రం అందుకు సుముఖంగా లేదన్నదే తన నిరాశా నిస్పృహలకు కారణమని ఆయన చెప్పారు. వారానికోసారి ఇలా కాల్పులు జరుగుతున్న అభివృద్ధి చెందిన దేశం ఏదీ ఈ భూప్రపంచం మీద లేదని, అమెరికాలోనే ఇలా జరుగుతోందని అన్నారు. 2012 డిసెంబర్లో జరిగిన హత్యాకాండ తర్వాత ఇప్పటివరకు 74 సంఘటనలు జరిగాయి. అమెరికాలో విచ్చలవిడిగా ఉన్న గన్ కల్చర్ మీద ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినా, దాన్ని మాత్రం ఇంతవరకు అరికట్టలేకపోయారు. చివరకు చిన్నపిల్లల చేతుల్లో కూడా తుపాకులు ఉండటం, వాళ్లు వాటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించడం లాంటివి కనిపించాయి. వ్యక్తిగత వివాదాలతోను, ప్రమాదాల తర్వాత, గ్యాంగ్స్టర్ల గొడవలు, డ్రగ్ లావాదేవీలు.. ఇలాంటి సంఘటనలలో ఎక్కువగా కాల్పులు జరిగాయి. తుపాకుల లైసెన్సింగ్ విధానాన్ని నియంత్రిద్దామంటే అనేక శక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అంటే కాంగ్రెస్‌లోని చాలామంది సభ్యులకు కూడా భయమని మండిపడ్డారు.