అమెరికా సిగ్గుపడాలి: ఒబామా
పాఠశాలల్లో వరుసపెట్టి కాల్పులు సంఘటనలు జరుగుతుండటంతో వాటికి ఇంతవరకు అడ్డుకట్ట వేయలేనందుకు అమెరికా సిగ్గుపడాలని సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. 18 నెలల వ్యవధిలో ఏకంగా 74 కాల్పుల సంఘటనలు అమెరికాలో జరిగాయి. ఓరెగాన్ హైస్కూల్లో 14 ఏళ్ల అబ్బాయిని కాల్చి చంపిన సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఆయనీ మాట అన్నారు. ప్రపంచంలో ఇంకెక్కడా ఇలా జరగట్లేదని, ఈ పరిస్థితి ఇక మారదా అని ఒబామా ప్రశ్నించారు. నమ్మలేనంత నష్టం కలిగించే వ్యక్తుల చేతుల నుంచి తుపాకులను దూరం పెట్టడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని, కానీ ఈ సమాజం మాత్రం అందుకు సుముఖంగా లేదన్నదే తన నిరాశా నిస్పృహలకు కారణమని ఆయన చెప్పారు.
వారానికోసారి ఇలా కాల్పులు జరుగుతున్న అభివృద్ధి చెందిన దేశం ఏదీ ఈ భూప్రపంచం మీద లేదని, అమెరికాలోనే ఇలా జరుగుతోందని అన్నారు. 2012 డిసెంబర్లో జరిగిన హత్యాకాండ తర్వాత ఇప్పటివరకు 74 సంఘటనలు జరిగాయి. అమెరికాలో విచ్చలవిడిగా ఉన్న గన్ కల్చర్ మీద ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినా, దాన్ని మాత్రం ఇంతవరకు అరికట్టలేకపోయారు. చివరకు చిన్నపిల్లల చేతుల్లో కూడా తుపాకులు ఉండటం, వాళ్లు వాటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించడం లాంటివి కనిపించాయి. వ్యక్తిగత వివాదాలతోను, ప్రమాదాల తర్వాత, గ్యాంగ్స్టర్ల గొడవలు, డ్రగ్ లావాదేవీలు.. ఇలాంటి సంఘటనలలో ఎక్కువగా కాల్పులు జరిగాయి. తుపాకుల లైసెన్సింగ్ విధానాన్ని నియంత్రిద్దామంటే అనేక శక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అంటే కాంగ్రెస్లోని చాలామంది సభ్యులకు కూడా భయమని మండిపడ్డారు.