
చిన్నారి జలచేప అద్భుత సాహసం!
ఉధృతంగా ప్రవహించే గంగానదిలో కొంతదూరం ఈత కొట్టడమే చాలా కష్టమైన పని. గజ ఈతగాళ్లు కూడా ఎక్కువ దూరాన్ని ఈదలేరు. అలాంటిది 11 ఏళ్ల చిన్నారి శ్రద్ధా శుక్లా మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 550 కిలోమీటర్లు ఈదేస్తానంటూ సాహసానికి సిద్ధమైంది. కాన్పూర్ నుంచి వారణాసి వరకు 10 రోజుల్లో 550 కిలోమీటర్లు ఈదాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాన్పూర్‌లోని మసక్రే ఘాట్ నుంచి ఆదివారం తన సాహసయాత్రను ప్రారంభించింది. రోజుకు అరవై కిలోమీటర్లు ఈదాలని ఈ వండర్ కిడ్ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఆహార, పానాదాలు, విశ్రాంతి కోసం రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే శ్రద్ధా తీసుకుంటుంది. మిగతా 19 గంటలూ ఈ చిన్నారి గంగానదీలో ఈదుతూనే ఉంటుంది.
అసాధారణ సాహసానికి పూనుకున్న శ్రద్ధా తొలిరోజే 100 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడం గమనార్హం. సిద్ధార్థనాథ్ ఘాట్ నుంచి ఉనావోలోని దేవి ఆలయం వరకు తొలిరోజూ తాను ఈదింది. ఈ అసాధారణ జలచిన్నారి చేపకు స్థానికులు స్వాగతం పలికి.. తమ హర్షధ్వానాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. 10రోజుల్లో 550 కిలోమీటర్లు ఈదడం ద్వారా 10 ఒలింపిక్స్ మారథాన్లను పూర్తిచేసిన ఘనతను చిన్నారి శ్రద్ధ సొంతం చేసుకోనుంది.