
పట్నా: బీహార్‌లోని పట్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంగా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా 76 ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
ఈ పాఠశాలలు సెప్టెంబర్ 26 వరకు మూసివేయనున్నారు. పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గంగా నది చాలా చోట్ల ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నందున ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు దానిలో పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగం విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల సమయానికి పట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయి (48.60 మీటర్లు) దాటి ప్రవహిస్తోంది. అలాగే హతిదా, దిఘా ఘాట్‌ల వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపధ్యంలో డిఎండి అదనపు ప్రధాన కార్యదర్శి (ఎసీఎస్) ప్రత్యయ అమృత్ 12 జిల్లాల అధికారులతో ఆన్‌లైన్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గంగానది నీటిమట్టం పెరిగితే అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
గంగా నది ఒడ్డున ఉన్న దాదాపు 12 జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 13.56 లక్షల మంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అలాగే బక్సర్, భోజ్‌పూర్, సరన్, వైశాలి, పట్నా, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్, ఖగారియా, భాగల్‌పూర్, కతిహార్ తదితర 12 జిల్లాలకు చెందిన ప్రజలను ప్రత్యేక సహాయ శిబిరాలకు తరలించారు.
ఇది కూడా చదవండి: వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్‌గా మార్చి..
Comments
Please login to add a commentAdd a comment