ఆ దేశంలో 20 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు!
పొగ తాగడం హనికరం అని ఎంత మొత్తుకున్నా.. ఎన్నిచోట్ల ప్రచారం చేసినా.. ఆ అలవాటు ఉన్న వారు మాననే మానరు. ఇప్పుడు అదే అలవాటు చైనాలో 20 కోట్లమందిని ఈ శతాబ్దంలో బలిగొనపోతున్నదని తాజాగా అధ్యయనం స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఐరాస మానవ అభివృద్ధి సంస్థ తరఫున నిర్వహించిన ఈ అధ్యయనంలో చైనాలో పొగ తాగే అలవాటు గురించి పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి.
చైనాలోని నిరుపేద ప్రాంతాల్లోనే పొగతాగడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించనున్నాయని, పొగాకు మీద ఆధారపడటాన్ని చైనా గణనీయంగా తగ్గిస్తే తప్ప దీనిని అడ్డుకోవడం సాధ్యం కాదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ప్రపంచంలోని సిగరెట్లలో 46శాతం తాగేది చైనాలోనే. అంతేకాదు సిగరెట్‌ల మీద గణనీయంగా లాభాలు ఆర్జించే దేశం కూడా అదే. 2015లో చైనా పొగాకు పరిశ్రమ 160 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్మోకింగ్ ముప్పు దేశాన్ని ముంచెత్తుతున్న నేపథ్యంలో చైనాలో పొగాకు రహిత విధానాలు మరింత ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరముందని డబ్ల్‌హెచ్‌వో సూచిస్తున్నది.