సమయం లేదు మిత్రమా.. స్వీట్ వార్నింగ్!
శ్రీనగర్: నేలతల్లి ఇంటికి మంచుమామ విచ్చేశాడు. భారీగా హిమపాతం కురిపిస్తూ ఉత్తరభారతాన్ని గిలిగింతలు పెట్టాడు. అసలే అందంగా ఉండే కశ్మీర్‌ను ఇంకాస్త రసవత్తరంగా మార్చేశాడు. ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ ధవళవర్ణంలో మెరిపోతూ కనిపించాడు. ఈ శీతాకాలపు అతిథి ఇంకా కొన్ని రోజులు మాత్రమే అక్కడ కొలువైఉంటాడు. తన మ్యాజిక్ కరిగిపోయి నీరులా మారకముందే చూడటానికి రమ్మంటూ పర్యాటకులను ఆహ్వానిస్తున్నాడు.‘సమయంలేదు మిత్రమా..’ అంటూ ‘స్వీట్ వార్నింగ్’ ఇస్తున్నాడు.
మధ్యధరా ప్రాంతంలో ఆవిర్భవించి, వాయువ్య దిశగా కదులుతూ హిమాలయాల వద్ద మంచు వర్షాన్ని కురిపించే Western Disturbance(పశ్చిమ కలవరాలు) జనవరి 3 నుంచి ఉత్తరభారతంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా హిమం, వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి ఇళ్లు, చెట్లు, రోడ్లు, వాహనాలు.. అన్నింటిపైనా ఇంచులకొద్దీ మంచు పేరుకుపోయింది. ఆ దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివెళుతున్నారు. రాగల 24 గంటలూ హిమపాతం కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఛండీగఢ్) అధికారి మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు.
(మంచుదుప్పటిలో ఉత్తరభారతం: ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)