'మంచి రోజులు' సోషల్ మీడియా సృష్టే!
'అచ్ఛే దిన్' (మంచి రోజులు).. ఏక్షణాన ప్రచారం ప్రారంభించారోగానీ ఈ నినాదం బీజేపీకి అధికారాన్ని, నరేంద్ర మోదీకి ప్రధాని పీఠాన్ని అందించింది. అయితే అసలా నినాదం బీజేపీది కానేకాదని కేవలం సోషల్ మీడియా సృష్టేనని తాజాగా బాంబు పేల్చారు కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
ఓ అధికార కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం ఇండోర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ' ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా అచ్ఛే దిన్ (మంచి రోజుల) మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఆ నినాదం బీజేపీది కాదు. సోషల్ మీడియానే సృష్టించింది' అని తోమర్ వ్యాఖ్యానించారు. ఎవరు ఆపాదించినప్పటికీ ఆ నినాదంతో తమ పార్టీ ఇమేజ్ పెరిగిన కారణంగా అలా కమిట్ అవ్వాల్సి వచ్చిందన్నారు.
ఆ తరువాత కొద్దిసేపటికే మరోసారి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసిన ఆయన.. తన వ్యాఖ్యల్లో కొన్నింటిని మాత్రమే కత్తిరించి చూపడం వల్ల భావంలో తప్పులు దొర్లాయని, అచ్ఛే దిన్ (మంచి రోజులు) నినాదం ముమ్మాటికీ బీజేపీదేనని, నరేంద్ర మోదీ జనరంజక పాలనలో ఇప్పటికే ఆ రోజులు వచ్చేశాయని వివరణ ఇచ్చుకున్నారు.'