దిగివస్తున్న సౌర విద్యుత్ ధర | Solar electricity price drop | Sakshi
Sakshi News home page

దిగివస్తున్న సౌర విద్యుత్ ధర

Published Tue, Aug 4 2015 2:54 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

దిగివస్తున్న సౌర విద్యుత్ ధర - Sakshi

దిగివస్తున్న సౌర విద్యుత్ ధర

టెండర్లకు భారీగా స్పందన
* రూ.5.17కే యూనిట్ ఇచ్చేందుకు సిద్ధమైన ‘స్కైపవర్’ సంస్థ
* 184 కంపెనీల నుంచి 4,623 మెగావాట్లకు బిడ్లు


సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ సరఫరా ధరలు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. మొదట్లో యూనిట్‌కు రూ.12కుపైనే ఉన్న ఈ ధర.. తాజాగా రూ.5.17కు తగ్గింది. సౌర విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా... మారిషస్‌కు చెందిన ‘స్కై పవర్ సౌత్ ఈస్ట్ ఏసియా’ అనే సంస్థ కనిష్టంగా రూ.5.17కే యూనిట్ చొప్పున సౌర విద్యుత్‌ను అందించేందుకు ముందుకు వచ్చింది.

రాష్ట్రంలో 50 మెగావాట్ల సౌర విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సౌర విద్యుత్ టెండర్లలో రూ.5.05కే యూనిట్ చొప్పున విక్రయించేందుకు ఈ సంస్థ ఆసక్తి చూపడం గమనార్హం.
 
దీర్ఘకాలిక ప్రాతిపదికన 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. 515 మెగావాట్ల కోసం అంతకు ముందు నిర్వహించిన టెండర్లలో నమోదైన కనిష్ట ధర రూ.6.45 ఆధారంగా రివర్స్ బిడ్డింగ్ విధానంలో ఈ టెండర్లను చేపట్టారు. గ్రూప్-1 కింద యూనిట్‌కు రూ.6.45 గరిష్ట ధరతో 500 మెగావాట్లు, గ్రూప్-2 కేటగిరీ కింద రూ.6.32 గరిష్ట ధరతో 1,500 మెగావాట్లకు బిడ్లను ఆహ్వానించారు. ఇందులో 184 కంపెనీల నుంచి మొత్తం 4,623 మెగావాట్ల విద్యుదుత్పత్తికి బిడ్లు వచ్చాయి.

కనిష్ట ధరను సూచించిన కంపెనీల ఎంపిక కోసం ప్రభుత్వం సోమవారం ‘ప్రైస్ బిడ్డింగ్’ను తెరిచింది. గ్రూప్-2 కేటగిరీలో కనిష్టంగా రూ.5.17కే యూనిట్ చొప్పున 50 మెగావాట్ల సౌర విద్యుత్కేంద్రాన్ని నిర్మించేందుకు ‘స్కైపవర్’ సంస్థ ముందుకొచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తించారు. అదే విధంగా గ్రూప్-1 విభాగంలో ‘సుజలాన్ ఎనర్జీ’ అనే కంపెనీ రూ.5.49కు యూనిట్ చొప్పున 50 మెగావాట్ల సౌర విద్యుత్కేంద్రాన్ని నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది.
 
టాప్‌గా నిలుస్తాం: కేసీఆర్
సౌర విద్యుదుత్పత్తిలో రాష్ట్రం నంబర్ వన్‌గా మారుతుందని సీఎం కేసీఆర్ అభిలషించారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తదితరులతో సోమవారం సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సౌర విద్యుత్ టెండర్ల ‘ప్రైస్ బిడ్డింగ్’ వివరాలను అధికారులు సీఎంకు సమర్పించారు. ఎక్కువ మొత్తంలో టెండర్లు వచ్చినందున విద్యుత్కేంద్రాల సంఖ్యను పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.

టెండర్లు ఖరారైన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ఈ టెండర్ల ద్వారా ఏడాది కాలంలో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని సీఎం చెప్పారు. గత జూన్‌లో 800 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం ఒప్పందాలు చేసుకున్నామని, వచ్చే మార్చిలోగా ఈ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రైతులకు పగలే 9 గంటల నిరంతర విద్యుత్ అందించే ప్రణాళికకు సౌర విద్యుత్ కీలకమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement