![పతకాలు పోయాయని ఫిర్యాదుకు వెళ్తే..](/styles/webp/s3/article_images/2017/09/4/71476441821_625x300.jpg.webp?itok=87L0MetP)
పతకాలు పోయాయని ఫిర్యాదుకు వెళ్తే..
భోపాల్: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఓ అమరజవానుకు మన దేశంలో దక్కే గౌరవం ఇదేనా?. ప్రాణత్యాగానికి గుర్తుగా ఇచ్చిన పతకాలు పోయాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పేపరు మీద ఉంటుందే తప్ప విచారణ వరకూ వెళ్లడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధానిలో వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం అమరవీరుల త్యాగానికి ఏ మాత్రం విలువ ఉంటుందో చెబుతోంది.
1994 జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల దాడుల్లో మధ్యప్రదేశ్ కు చెందిన కెప్టెన్ దేవశీష్ శర్మ వీర మరణం పొందారు. భారత ఆర్మీలోని పంజాబ్ రెజిమెంట్లో ఆయన డాక్టర్ గా విధులు నిర్వహించేవారు. శర్మ మరణించే నాటికి ఆయన వయసు 25. దీంతో విధి నిర్వహణలో అమరుడైన శర్మను కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర, విరాట చక్ర పతకాలతో సత్కరించింది.
అయితే 2014లో అక్టోబర్ లో శర్మ ఇంట్లో దోపిడి జరగడంతో పతకాలు పోయాయని ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మూడు నెలల తర్వాత పోలీసులు తనకు ఫోన్ చేసినట్లు నిర్మలా దేవి తెలిపారు. పతకాల దొంగలను పట్టుకున్నారని చెబుతారని భావించిన ఆమెకు కేసు విచారణను ముందుకు జరపాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పారని వివరించారు. తాను అందుకు ఒప్పకోలేదని చెప్పారు.
శుక్రవారం అమరజవానులను ఉద్దేశించి భోఫాల్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనుండటం, అమరజవాను పతకాలను వెతికి తేవడానికి లంచం డిమాండ్ చేశారనే కథనం మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ప్రభుత్వం కదిలింది. మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపింద్రసింగ్ నిర్మలాదేవిని కలిసి ఆమెతో మాట్లాడారు. నిర్మాలాదేవి కేసును రీ ఓపెన్ చేయిస్తామని చెప్పారు. ఏ అధికారి ఆమెను లంచం డిమాండ్ చేశారో గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పరీకర్ తో చర్చించి డూప్లికేట్ మెడల్స్ ను అందించే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అమరజవాను తల్లి నిర్మలాదేవి పతకాలు తిరగి వెనక్కు వస్తాయనే ఆశలు మరలా చిగురించినట్లు పేర్కొన్నారు. లాలాపేరేడ్ గ్రౌండ్స్ లో జరగునున్న మోదీ సభకు తాను కూడా హాజరౌతానని తెలిపారు.