నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే...
ఏలూరు : నాణ్యత ప్రమాణాలు పాటించకుండా హడావుడిగా పనులు చేపట్టడం వల్లే పోలవరం కుడి కాల్వకు గండి పడిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శనివారం పెద్దవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడి కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని ఆయన పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతి రాజు వర్మతో కలసి పరిశీలించారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ... ప్రభుత్వానికి పనుల నాణ్యతపై దిశానిర్దేశం చేయాల్సింది అధికారులే అని ఆయన స్పష్టం చేశారు.
కానీ పోలవరం కుడి కాలవ పనులపై అధికారులు నిర్లక్ష్యం వహించారని వీర్రాజు విమర్శించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క పైపు లైన్ ప్రవాహానికే కాల్వ గండిపడితే... 12 పైపు లైన్లు పూర్తి... ఆ తర్వాత గండిపడి ఉంటే పరిస్థితి ఇంకేలా ఉండేదో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ జరిగితే ఏవరిది బాధ్యత అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైన ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతతో పాటు... తప్పిదాలు జరగకుండా చూడాలని ఆధికారులు, ప్రభుత్వానికి సోము వీర్రాజు సూచించారు.