డివైడ్ టాక్ వచ్చినా స్థిరంగా కలెక్షన్లు!
దక్షిణాది టాప్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన తాజా బాలీవుడ్ సినిమా 'అకీరా'. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడి ఒరియంటెడ్ సినిమా ఇటు ప్రేక్షకుల నుంచి, అటు విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తోంది.
ప్రారంభంలో ఈ సినిమాకు బాగా నిరాశాపూరితంగా వసూళ్లు దక్కినా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ సినిమా మంగళవారం కూడా చెప్పుకోదగినస్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లో రూ. 22.45 కోట్లను ఈ సినిమా తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, సోనాక్షి, మురగదాస్ కు మంచి ఇమేజ్ ఉండటం ఈ సినిమా థియేటర్లవైపు ప్రేక్షకులను నడిపిస్తోంది.
'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు వసూళ్లు గణనీయంగా పెరిగి.. రూ.6.20 కోట్లు రాబట్టింది. ఇక సోమవారం రూ. 3.40 కోట్లు రాబట్టగా, మంగళవారం రూ. 2.40 కోట్లు రాబట్టిందని, మొత్తంగా భారత్ లో ఈ సినిమా రూ. 22.45 కోట్లు రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి సేఫ్ ప్రాజెక్టు అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
మురగదాస్‌కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్‌కుమార్, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్‌ఖాన్‌తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది.