
తెలుగువారిలో చిచ్చుపెట్టారు: లక్ష్మీపార్వతి
సాక్షి , హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, సోనియాగాంధీ తెలుగువారి మధ్య చిచ్చు పెట్టారని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. ఇన్నాళ్లు కలసిమెలసి ఉన్న తెలుగువారి నడుమ వైషమ్యాలు, విద్వేషాలను సోనియా రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఆంధప్రదేశ్ నుంచి 32 మంది ఎంపీలను గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు లక్ష్మీపార్వతి మద్దతు పలికారు. బుధవారం సచివాలయంలో ఉద్యోగుల ఆందోళనలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన పాపంలో అన్ని పార్టీల పాత్ర ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిందన్నారు. రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయేది విద్యార్థులు, ఉద్యోగులేనని.. వారి ఆందోళనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. 1969లో ఇందిరాగాంధీ తెలంగాణ ఏర్పాటును బలంగా వ్యతిరేకిస్తే, ఆమె కోడలు సోనియాగాంధీ ఇప్పుడు స్వప్రయోజనాల కోసం తెలుగు వారిని చీల్చుతున్నారని విమర్శించారు.
ఎనిమిదిన్నర కోట్ల మంది తెలుగువారి రాతను నలుగురు పరభాషీయులు నిర్ణయించడం తెలుగువారికి పట్టిన దౌర్భాగ్యమన్నారు. కేవలం నలుగురు స్వార్థపరులు, సోమరిపోతుల ఉద్యమానికి 120 ఏళ్ల చరిత్ర కలదని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు ఆనాడు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చుంటే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదన్నారు. 50 ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు సీమాంధ్రులను వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల విద్య, ఉద్యోగాలు, విద్యుత్, నీరు.. ఇలా లెక్కకు మించి సమస్యలు తలెత్తుతాయని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.