ప్రీమియం ఫోన్లదే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. రూ.30 వేలకుపైగా ఖరీదున్న ప్రీమియం మోడళ్ల అమ్మకాలు ఏకంగా రెండింతలపైగా వృద్ధి నమోదు చేస్తున్నాయి.దీన్నిబట్టి చూస్తే భారతీయులకు గ్యాడె్జట్లపట్ల ఉన్న ఆసక్తి ఇట్టే అర్థమవుతోంది. ప్రధానంగా 35 ఏళ్ల లోపున్న యువత ఇటువంటి ఖరీదైన మోడళ్లకు ఆకర్షితులవుతున్నారు. మార్కెట్లోకి కొత్త మోడల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారూ లేకపోలేదు. మార్కెట్ రిసెర్చ్ కంపెనీ జీఎఫ్‌కే అధ్యయనం ప్రకారం దేశంలో స్మార్ట్‌ఫోన్ల పరిమాణం 3.3 కోట్ల యూనిట్లు. ఇందులో ప్రీమియం విభాగం వాటా విలువ పరంగా చూస్తే 25 శాతం, పరిమాణం పరంగా 20 శాతం ఉందని సోని ఇండియా మార్కెటింగ్ హెడ్ తడటో కిముర తెలిపారు. రూ.44,990 ధర కలిగిన ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రీమియం ఫోన్ బ్రాండ్‌గా..
మొబైల్ ఫోన్లను ప్రీమియం బ్రాండ్‌గా నిలపడమే సంస్థ తొలి ప్రాధాన్యత అని సోని వెల్లడించింది. ఎక్స్‌పీరియా జడ్ ఆవిష్కరణతో బ్రాండ్ ఇమేజ్ బలపడిందని తెలిపింది. రూ.30 వేలపైన ఖరీదున్న అయిదు రకాల మోడళ్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సోని ఎక్స్‌పీరియా వాటా 10 శాతముంది. 2013-14లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నామని, వచ్చే ఏడాది మార్చికల్లా తొలి స్థానం సాధిస్తామని కిముర అన్నారు. హిట్ మోడల్స్‌నే ప్రవేశపెడతామని చెప్పారు.