తొలిసారి మౌనం వీడిన గంగూలీ!
కుంబ్లే రాజీనామాపై స్పందన
భారత క్రికెట్‌ను కుదిపేసిన అనిల్ కుంబ్లే-విరాట్ కోహ్లి గొడవపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో కొంత పరిణతితో వ్యవహరించాలి ఉండాల్సిందని బీసీసీఐకి అక్షింతలు వేశారు. కోచ్‌ను ఎంపిక చేసేందుకు ఏర్పాటైన క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ)లో గంగూలీ కూడా సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
కుంబ్లే-కోహ్లి విభేదాలపై స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘కుంబ్లే-కోహ్లి మధ్య జరిగిన వ్యవహారాన్ని మెరుగ్గా పరిష్కరిస్తే బాగుండేది. ఈ వ్యవహారంలో సరిగ్గా వ్యవహరించలేదు’ అని ఆయన తేల్చిచెప్పారు. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోహ్లితో విభేదాల కారణంగా అనిల్ కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్ రేసులో అనూహ్యంగా రవిశాస్త్రి దూసుకొచ్చారు.
కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న ఆయన రేసులో ముందున్నట్టు వినిపిస్తోంది. గతంలో సీఏసీ సభ్యుడైన గంగూలీ కారణంగానే కోచ్ పదవి తనకు దక్కలేదని రవిశాస్త్రి వాపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కోచ్ రేసులోకి వచ్చిన రవిశాస్త్రి గురించి గంగూలీ స్పందిస్తూ ‘ఎవరైనా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరిపాలక మండలిలో లేనట్టయితే నేను కూడా దరఖాస్తు చేసుకొని ఉండేవాడిని’ అని పేర్కొన్నారు.