
లండన్‌లో రోలిన్ స్ట్రాస్‌కు మిస్‌వరల్డ్ కిరీటం అలంకరిస్తున్న నిరుటి మిస్ వరల్డ్ మేగన్ యాంగ్
* రోలిన్ స్ట్రాస్‌కు ‘మిస్ వరల్డ్ 2014’ కిరీటం
* ‘టాప్ 10’తోనే సరిపెట్టుకున్న భారత సుందరి
లండన్: ప్రపంచ అందాల వేదికపై దక్షిణాఫ్రికా సుందరి మెరిసింది. వందకు పైగా దేశాల అందాలరాశులను వెనక్కి నెట్టిన మిస్ సౌతాఫ్రికా రోలిన్ స్ట్రాస్(22) ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆదివారం లండన్‌లోని ఎక్సెల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన మిస్ వరల్డ్-2014 ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచిన రోలిన్ ప్రపంచ సుందరి కిరీటం ధరించి చిరునవ్వులు చిందించింది.
దక్షిణాఫ్రికాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఈ సుందరి తన అందచందాలు, సమాధానాలతో న్యాయనిర్ణేతల మనసులను గెలుచుకుంది. గతేడాది విజేత ఫిలిప్పీన్స్‌కు చెందిన మేగన్ యాంగ్ కొత్త ప్రపంచ సుందరికి కిరీటం తొడుగుతూ.. ‘నీ మార్గంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు’ అని సలహా ఇచ్చారు.
రోలిన్ తర్వాత రెండో స్థానంలో హంగరీ భామ కల్సర్ రన్నర్ అప్‌గా నిలవగా, అమెరికా సుందరి సఫ్రిత్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక భారత్ తరఫున ‘మిస్ వరల్డ్ 2014’ రేసులో పోటీపడిన ఢిల్లీకి చెందిన కోయల్ రాణా(21) టాప్ 10లోకి చేరుకోగలిగినా, టాప్-5లోకి చేరడంలో విఫలమైంది. దీంతో రేసు నుంచి వైదొలగింది. అయితే, కోయల్‌కు ఈ పోటీల్లో ‘బెస్ట్ డిజైనర్ అవార్డు’ దక్కింది.
అలాగే ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ అవార్డును కెన్యా, గయానా, బ్రెజిల్, ఇండోనేసియా భామలతో కలిసి పంచుకొంది. ఈ పోటీలో మొత్తం 121 దేశాల సుందరీమణులు పాల్గొన్నారు. భారత్ తరఫున చివరిసారిగా 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్‌వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు.